ఆయన సామాజిక స్ఫూర్తి కలిగించే సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట. తన తొలిసినిమా ఎన్ కౌంటర్ తోనే సంచలనానికి తెరతీసి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. 1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టి శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం లాంటి స్ఫూర్తి కలిగించే సినిమాలు ఎన్నో తీశారు. అనేక అవార్డులు, రివార్డులతో పాటు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సమకాలీన పరిణామల, తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిను కథగా అల్లుకుని ఆయన తీసిన ‘జై బోలో తెలంగాణా’ సినిమా ‘మినియేచర్ ఆఫ్ ఎ మూమెంట్’గా ప్రశంసలు అందుకుంది. ఈ ఎన్ కౌంటర్ శంకర్ ఇంకా ఏమేం విశేషాలు చెబుతున్నారో చూద్దాం. ఎన్ కౌంటర్, శ్రీరాములయ్య సినిమాలు ఈ ఆగస్టు 14వ తేదీనే విడుదల కావడం మరో విశేషం. వేదిక పేరుతో మరో విశేషానికి తెరతీస్తున్నారాయన.
- ఇన్ని సంవత్సరాల మీ సినిమా ప్రయాణంలో మీరు ఏం నేర్చుకున్నారు?
నేను నా సినిమాలో ఒక డైలాగ్ చెప్పా ‘ఆటుపోట్లులేని సముద్రం ఉండదు… గెలుపు ఓటములు లేని యుద్ధం ఉండదు’ అని. సో ఏ బ్యాగ్రౌండు లేకుండా వచ్చిన నాలాంటివాడికి ఇలాంటివి తప్పదు. కచ్చితంగా నా సినిమా కథల్లోనూ సంఘర్షణ ఉంటుంది, జీవితంలోనూ సంఘర్షణ ఉంటుంది. నా జీవితం, నా అనుభవాలు, నేను నేర్చుకున్న అంశాలన్నీ నా సినిమాల్లో ఉంటాయి. సినిమాలు అనేవి నాకు ఆసక్తి లేని అంశం చిన్నపుడు. సమాజానికి సరిపడే నూతన ఆలోచనా విధానం కావచ్చు, నేనుభవించిన ఆర్థిక, సాంఘిక పరిస్థితులు, నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు కావచ్చు వీళ్లందరి ప్రభావం నా జీవితం మీద ఉంటుంది, నా సినిమాల మీద కూడా ఉంటుంది. అకస్మాత్తుగా ఈ పరిశ్రమకు వచ్చాను. సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డిగారిది, మాది పక్కపక్క ఊర్లు. నేను నల్గొండలో శ్రీశీగారి కవిసమ్మేళనంలో ఓ కవిత చదివాను. అది చూసి నువ్వు సినిమాల్లోకి రారా బాబూ అని ఆయన అన్నారు.అలా ఆయన నన్ను సినిమా రంగంలోకి తీసుకెళ్లడం జరిగింది. 1984లో మద్రాసు వెళ్లాను. భారతంలో శంఖారావం అనే సినిమాకి అసిస్టెంటు డైరెక్టర్ గా చేరాను. దానికి బి. భాస్కరరావు దర్శకుడు. అక్కడిని సినిమాని నేర్చుకుంటున్న సమయంలో దాని మీద ఆసక్తి ఏర్పడింది. దీని ద్వారా సమాజానికి ఏమైనా చెప్పొచ్చు అనే అభిప్రాయం కలిగింది. స్టూడెంట్స్ ఆర్గనైజర్ గా ఉన్న నేను సినిమా అనే మాధ్యమం ద్వారా మనం ఏదైనా బలంగా చెప్పొచ్చనే అభిప్రాయం కలిగింది. నా ఆలోచనలను పంచుకోడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని కూడా భావించాను. దర్శకత్వ శాఖలో 13 ఏళ్లు వివిధ హోదాల్లో పనిచేశాను. - ఎన్ కౌంటర్ సినిమా విడుదలై శుక్రవారానికి దాదాపు 23 ఇయర్స్ కావస్తోంది. ఈ మీ మొదటి సినిమా అనుభవాలు చెప్పండి?
తెలంగాణలోగాని, ఉత్తరాంధ్రలోగాని, రాయలసీమ కొన్ని ప్రాంతాల్లోని, కొన్ని కల్లోలిత ప్రాంతాల్లోగాని కూంబింగ్ పేరుతో చిన్నపిల్లలను సైతం ఎన్ కౌంటర్ పేరుతో కాల్చి చంపడం నాకు బాధేసింది. నేను సినిమా దర్శకుడు అవ్వాలనుకుంటున్న తరుణంగా ఇలాంటి సంఘటనలు జరిగాయి. నా ఆలోచనలను, నా ఆవేదనను సినిమాల ద్వారా చెప్పటమే నా ఉద్ధేశం కాబట్టి ఎన్ కౌంటర్ పైనే సినిమా చేయాలనుకున్నా. ఆయన సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను కాబట్టి ఆ పరిచయంతోనే ఈ సినిమా తెరకెక్కగలిగింది. అసలు ఈ సినిమాని సెల్వమణి చేయాల్సి ఉన్నా కొంత గ్యాప్ రావడంతో నాకు ఈ అవకాశం వచ్చింది. సినిమా మొదలైనపుడు కూడా సినిమా షూటింగ్ మీద చాలా నిఘా ఉండేది. ఆ రోజుల్లో ఎన్ కౌంటర్ వార్త లేని పేపర్ ఉండేది కాదు. మారుమూల ప్రాంతాల్లో ఒక భయానక వాతావరణం ఉండేది. పైగా నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సామన్య ప్రజలు తిరగడానికి కూడా భయపడే వాతావరణం ఉన్న తరుణంలో ఈ సినిమాని పూర్తి చేయగలిగాను. ఈ సిననిమా షూటింగ్ జరిగేటప్పుడే నిన్న ఎన్ కౌంటర్ చేసేస్తారని చాలా మంది భయపెట్టారు కూడా. నువ్వ గవర్నమెంటుకు వ్యతిరేకంగా వెళుతున్నావంటూ హెచ్చరించారు. - కృష్ణగారు ఈ పాత్రకు సరిపోతారని ఎలా అనుకున్నారు?
కచ్చితంగా సరిపోతారని అనుకున్నా. ఎందుకంటే నేను కృష్ణగారి అల్లూరి సీతారామరాజు సినిమాని నా చిన్నపుడు చూశా. ఆ సినిమా నా మీద చాలా ముద్ర వేసింది. అప్పటినుంచి ఆయనంటే అభిమానం కూడా పెరిగింది. మొదట మూడు భాషల్లో ఈ సినిమాని చేయాలనుకున్నారు. తమిళం, మలయాళం, తెలగు భాషల్లో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. ఇందులో కృష్ణ గారితో పాటు మమ్ముట్టి, రాధిక, రోజా, ప్రశాంత్ తారాగణం. అయితే మమ్ముట్టి స్థానంలో వినోద్ కుమార్, ప్రశాంత్ స్థానంలో రమేష్ బాబుతో సినిమాని ప్రారంభించాం. తెలుగు సినిమాని మాత్రమే చేయగలిగాం. కృష్ణ గారు కథ విన్న 15 రోజులకే షూటింగ్ ప్రారంభమైంది.మూడు నెలల్లో సినిమాని ఆగస్టు 14న విడుదల చేయడం కూడా జరిగిపోయింది. ఆ తర్వాత చేసిన శ్రీరాములయ్య సినిమా కూడా ఇదే రోజు విడుదల కావడం కాకతాళీయమే. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమే కారు బాంబులు పేలడంతో జరిగింది. నవంబరు 16న నా పెళ్లి, 19వ తేదీన సినిమా షూటింగ్… భయమూ బాధ ఉన్నా కూడా సినిమా చేయగలిగాం. - మీ సినిమాలన్నీ సామాజిక చైతన్యంతో ఉంటాయి ఎందుకు?
నాకంటూ ఒక శైలి కావాలనుకున్నా. సినిమాని కమర్షియల్ గానూ తీయవచ్చు, కళాత్మకంగా తీయవచ్చు. ఆర్ట్ ఫిలిమ్ లను ఎక్కువమంది చూసే అవకాశం లేదు. దర్శకత్వశాఖలో నేను చేసినవన్నీ కమర్షియల్ సినిమాలే. కమర్షియల్ సినమాల రీచింగ్ నాకు తెలుసు. కళాత్మకంగా సినిమా చేస్తే ఎంతమంది చూస్తారు అనే ప్రశ్న ఉండేది. కళ కళ కోసం కాదు ప్రజల కోసం అనే సిద్ధాంతం నాది. ఎక్కువమంది చూస్తేనే కదా ఆ కళకు ప్రయోజనం. నాకంటూ ఒక శైలి కావాలని కమర్షియల్ ఫార్మాట్ లో రియలిస్టిక్ కొలబద్దను మిక్స్ చేసి సినిమాలు చెయ్యాలని నిర్ణయించుకున్నా. నా సినిమాలన్ని అదే ఫార్ములాలో ఉంటాయి. నేను చెప్పలకున్నది ఎక్కువమందికి తెలియాలన్నదే నా ఉద్ధేశం. నా ప్రయాణం అలా కొనసాగింది. డాక్టర్ ప్రభాకరరెడ్డి నన్ను సినిమాకు పరిచయం చేస్తే కృష్ణ గారు నన్ను సినిమా దర్శకుడిని చేయగా నాకు ఒక వేదిక అనేది దొరికింది. - ఎలాగూ మీకు వేదిక దొరికింది… మంచి విజయాలు అందుకున్నారు? మీ లైఫ్ యాంబిషన్ ఏమిటి?
దానికి కూడా ఒక వేదిక కావాలనేదే నా ప్రయత్నం. 2003లో ఆయుధం సినిమాకి ఐదుగురు కొత్తవారిని పాటల రచయితలుగా ఎంపిక చేశా. వారంతా 25 ఏళ్ల లోపువారే. వారంతా ఇప్పుడు చక్కగా సెటిలయ్యారు. చిన్ని చరణ్, గోరటి వెంకన్న లాంటి వారంతా నేను పరిచయిం చేసినవారే. ప్రతి సినిమా నాకు ఒక పోరాటమే. సినిమా రంగంలో ఎన్నో ఆటుపోట్లు నాకు తెలుసు. ఐదుగురిని నేను పరిచయం చేయడంతో చాలామంది నన్ను కలిసి అవకాశాల కోసం అడిగేవారు. ఆయుధంకు నేను నిర్మాతను. ఇంతమందికి మనం అవకాశం ఇవ్వాలంటే మనల్ని మనం విస్తరించుకోవాలని అర్థమైంది. నేనే వేదిక అవ్వాలనుకున్నా. అందుకే నేను వేదికను ప్రారంభించాలనుకున్నా. దీనికోసమే స్టూడియోకు భూమి ఇవ్వండి అడిగాను. అది మెటీరియలైజ్ కాలేదు. నా రెండు సినిమాలు విడుదలైన రోజున వేదిక అనే ఫ్లాట్ ఫామ్ ని ప్రకటించాలనకున్నా. అదే రేపే అవుతుంది. ఈ వేదిక ద్వారా ఐదు వెబ్ సిరీస్, మరో ఐదు వెబ్ మూవీస్, రెండు చిన్న సినిమాలు నిర్మించబోతున్నా. దర్శకుడిగా నేను ప్రపంచానికి పరిచయమైన రోజున ఈ విషయాలు ప్రకటించబోతున్నా. కథలు సిద్ధమయ్యాయి. అక్టోబరు నుంచి వీటిని ప్రారంభించాలనేది నా ఉద్ధేశం. కరోనా ఉంది కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలనే ఆలోచిస్తున్నా. రెండు దఫాలు దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నా.అసోసియేషన్ తరఫున అనేక సహాయక కార్యక్రమాలు చేస్తున్నా. - ఈ కరోనా సమయంలో ఎలాంటి సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు?
దర్శకుల సంఘం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. రెండు దఫాలు నిత్యావసరాలు పంపిణీ చేశాం. ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాం. త్వరలో మళ్లీ సహాకకార్యక్రమాలు ఉంటాయి. ఎవరూ తిరగని లాక్ డౌన్ టైమ్ లో మేం తిరిగి చాలాకార్యక్రమాలు చేపట్టాం.