ఎస్.ఎల్.ఎస్ సమర్పణలో తోట క్రియేషన్స్ బ్యానర్‌పై సాయికిరణ్ కోనేరి, వికాసిని, జ్యోతి సింగ్ హీరోహీరోయిన్లుగా వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో నిర్మాత తోట సుబ్బారావు నిర్మించిన చిత్రం ‘అతడెవడు’. ఈ చిత్ర పోస్టర్ మరియు టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. టీజర్‌ను ప్రముఖ దర్శకుడు చంద్రమహేష్, దర్శకుడు తోట వేణు సంయుక్తంగా విడుదల చేయగా.. పోస్టర్‌ను నిర్మాత ప్రసన్న కుమార్, నటుడు జాకీ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు చంద్రమహేష్ మాట్లాడుతూ.. ‘‘1989లో కాకినాడలోని మా ఇంట్లో షూటింగ్ జరిగింది. ఆ చిత్రం పేరు ‘లేచింది మహిళా లోకం’. ఆ చిత్రానికి దర్శకుడు తోట రామ్‌మోహన్‌రావు గారు. ఆ సినిమా టైమ్‌లోనే నాకు దర్శకత్వానికి సంబంధించి అన్ని విషయాలు తెలిశాయి. ఆ తర్వాత నేను కూడా దర్శకుడిగా మారాను. నేను దర్శకుడిని అవడానికి కారణం తోట రామ్‌మోహన్‌రావుగారే. సొసైటీ ఇప్పుడేం కావాలనుకుంటుందో అటువంటి సినిమాని ఇప్పుడు వాళ్లబ్బాయి తీశారు. ‘అతడెవడు’ టీజర్ చాలా బాగుంది. దర్శకుడు చాలా సాఫ్ట్‌గా కనిపిస్తున్నాడు కానీ.. సినిమా మాత్రం మంచి ఫైర్‌లా తెరకెక్కించారని ఈ టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఆయనలో చాలా మంది డైరెక్టర్స్ కనిపిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వాలని, నిర్మాతలకు ఈ చిత్రం మంచి పేరు తీసుకువచ్చి.. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌లోనే సినిమా సక్సెస్ కనబడుతుంది. చాలా క్యాచీగా ఉంది. చంద్రమహేష్‌గారు, వేణుగారు, జాకీగారు వీళ్లంతా సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా వచ్చారు. వారి ఆశీస్సులు అందాయంటే సినిమా సగం సక్సెస్ అయినట్లే. టీజర్ చూశాను.. హీరోహీరోయిన్లు చాలా చక్కగా చేశారు. దర్శకుడు నంది వెంకటరెడ్డి ఉగాది పచ్చడి టైపులో కనిపిస్తున్నాడు. అన్ని జోనర్స్‌ని ఆయన మిక్స్ చేసేశాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాత, దర్శకుడికి మంచి పేరు తీసుకురావాలి..’’ అన్నారు.
నిర్మాత తోట సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘తోట పేరుకు ఇక్కడున్నవారంతా నాలాగే అభిమానులు. దర్శకుడు ఈ కథ చెప్పగానే.. వెంటనే ప్రొడ్యూస్ చేయాలని అనిపించింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా.. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాని తీశాం. హీరోహీరోయిన్లు, సాంకేతిక నిపుణులు అందరూ చాలా కోపరేట్ చేశారు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను..’’ అన్నారు.
దర్శకుడు వెంకట్ రెడ్డి నంది మాట్లాడుతూ.. ‘‘ముందుగా తోట సుబ్బారావుగారి గురించి చెప్పాలి. ఏ విషయంలోనూ ఆయన కాంప్రమైజ్ కాలేదు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు. ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులందరికీ మా చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెలాఖరుకి ఆడియో ఫంక్షన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సెన్సార్‌కి కూడా డేట్ ఫిక్సయింది. నెక్ట్స్ మంత్ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం..’’ అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు జాకీ, దర్శకుడు వేణు, హీరోహీరోయిన్లు, నిర్మాత తమ్ముడు తోట నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ సినిమా పెద్ద విజయం సాధించాలని అభిలాషించారు.