రూ. లక్షా పది వేలతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన స్టార్ కమెడియన్!!
"జేబులో పది రూపాయలు కూడా లేక అల్లాడిన పరిస్థితి నుంచి... లక్షా పది వేలతో ఓ కుటుంబంలో వెలుగులు పంచే పొజిషన్ ఇచ్చిన కళామతల్లికి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు స్టార్ కమెడియన్ షకలక శంకర్.
దర్శకత్వశాఖలో పని చేసే బైరు సిద్ధు అనే కుర్రాడి కుటుంబం దీనావస్థ తెలుసుకుని చలించిపోయిన షకలక శంకర్… లక్షా పది వేల రూపాయలతో… ఆ కుటుంబానికి కాడెద్దులు… నాగలి కొనిపెట్టారు.
నల్గొండ జిల్లా, గుర్రంపోడ్ మండలం… ‘పాల్వాయి’ అనే పల్లెటూరుకు చెందిన బైరు చిన నర్సింహ-లక్ష్మమ్మ దంపతులకు.. లక్ష రూపాయలతో కాడెడ్లు.. పది వేలతో నాగలి కొనిపెట్టి.. స్వయంగా పాల్వాయి గ్రామానికి వెళ్లి.. స్థానిక పెద్దల సమక్షంలో బహూకరించారు షకలక శంకర్. ఎం.పి.పి. మంచికంటి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ మణిపాల్ రెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు షకలక శంకర్ ను బహుదా అభినందించారు!
ఇకపై సంపాదనలో నాలుగో వంతు నలుగురి కోసం!
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ... 'ఇకపై.. నా సంపాదనలో పావు వంతు సేవా కార్యక్రమాలకు కేటాయించాలని నిర్ణయించుకున్నాను. భగవంతుడు ఆ శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నాను' అన్నారు!!