తెలుగు వార్తలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు కార్పొరేట్ బడ్జెట్ …..

R Naryayana Murthy

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ కార్పొరేట్ బడ్జెట్ ను తలపిస్తుందని ప్రముఖ సినీనటులు, దర్శక నిర్మాత, సామాజిక విశ్లేషకులు ఆర్. నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. అయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రైతన్న సినిమా గురించి మాట్లాడుతూ: బడ్జెట్ లో రైతులకు గిట్టుబాటు ధర కల్పించే అంశాన్నే ప్రస్తావించలేదని ఆరోపించిన నారాయణమూర్తి… డాక్టర్ స్వామినాథన్ ప్రతిపాదనల మేరకు బడ్జెట్ కేటాయిస్తే రైతులకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలను విస్మరించి ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకు అనుకూలంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఆరోపించిన నారాయణమూర్తి…. జీఎస్టీ, సెస్ లను కేంద్రం పరిధిలోకి తీసుకెళ్తే రాష్ట్రాలు సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తాయని ప్రశ్నించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కుప్పకూల్చి ప్రైవేటుపరం చేస్తే కార్పొరేట్ శక్తులు.. పంచభూతాలను కూడా అమ్ముకుంటాయని, అప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏమిటని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమంగా చూడాలని కోరారు.


తాను నిర్మిస్తున్న రైతన్న సినిమా ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది అని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఫిబ్రవరి నెలాఖరులో కానీ మార్చి ప్రథమార్థంలో కానీ సినిమాని రిలీజ్ చేస్తామని తెలిపారు..