NRI

సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల

సాయిదత్త పీఠంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల

చిన్నారులకు సంకీర్తన నేర్పించిన పద్మశ్రీ శోభారాజు

నాట్స్, కళావేదిక, సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో నిర్వహణ

ఎడిసన్, జూలై 23: అమెరికాలో రేపటి తరానికి కూడా మన సంస్కృతి, సంప్రదాయలను పరిచయం చేయాలనే సంకల్పంతో అమెరికా పర్యటన చేస్తున్న  పద్మశ్రీ శోభారాజు న్యూజెర్సీ సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు మందిరంలో అన్నమయ్య సంకీర్తన కార్యశాల ఏర్పాటు చేశారు. ఎడిసన్ ‌లోని సాయి దత్త పీఠం, కళావేదిక, నాట్స్ సంయుక్తం గా ఈ కార్యశాలను దిగ్విజయం చేశాయి. అన్నమయ్య పద కోకిల శోభారాజు 50 మంది పైగా పిల్లలకు అన్నమయ్య సంకీర్తనలు నేర్పించారు. ఈ కార్యశాలలో నాట్స్, సాయిదత్త పీఠం, కళావేదిక తో కలిసి, డాక్టర్ శోభారాజుకి వెంకటేశ్వర మీరా బిరుదును ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ ఛైర్ విమెన్ అరుణగంటి, నాట్స్ సంబరాలు 2023 కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ బోర్డు సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ బోర్డ్  డైరెక్టర్ రాజ్ అల్లాడ, నాట్స్ మీడియా సెక్రటరీ మురళీకృష్ణ మేడిచెర్ల, దామూ గేదెల, విష్ణు ఆలురు, వంశీ కొప్పురావూరి, అరుణ్ శ్రీరామ్, బసవ శేఖర్ శంషాబాద్, టి.ఎఫ్.ఏ.ఎస్ ప్రెసిడెంట్ మధు రాచకళ్ళ, ఉమ మాకం తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. 

సాయి దత్త పీఠం నిర్వాహకులు, చైర్మన్ రఘు శర్మ శంకరమంచి, బోర్డు డైరెక్టర్స్, సభ్యులు, చిన్నారుల తల్లితండ్రులు,  అమెరికాకు విచ్చేసి తన అమూల్యమైన సమయాన్ని ప్రవాస తెలుగువారి కోసం వెచ్చించినందుకు శోభారాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.