యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లల్లో ప్రసారమౌతోన్న సెక్సువల్ కంటెంట్‌తో కూడిన కథనాలపై ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఘాటుగా స్పందించారు. నటీనటులపై అసభ్యకర, అశ్లీల వీడియోలు చేస్తున్న యూట్యూబర్లను విష్ణు హెచ్చరించారు. నటీనటులు, వారి కుటుంబసభ్యులపై అశ్లీలంగా పెట్టిన వీడియోలు, పోస్టులను 48 గంటల్లో తొలగించాలని సూచించారు. లేదంటే ఆ యూట్యూబర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ఛానల్స్‌ను మూసివేయించనున్నట్లు పేర్కొన్నారు.
యూట్యూబ్ సహా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సెక్సువల్, అసభ్య, అభ్యంతర కంటెంట్‌తో కూడిన కథనాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తెలుగువారి నైజం కాదని అన్నారు. తెలుగు సంప్రదాయాలకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోన్నారంటూ మండిపడ్డారు. తన దృష్టికి వచ్చిన కొన్ని యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లల్లో వస్తోన్న కథనాలను చూడగా.. అత్యంత జుగుప్సాకరంగా ఉంటోన్నాయని అన్నారు. వాటి గురించి మాట్లాడుతుంటేనే ఒళ్లు జలదిస్తోందని పేర్కొన్నారు.
ఇటీవల ఓ చిన్నారిపై అసభ్యకరంగా మాట్లాడిన యూట్యూబర్ ఉదంతంపై స్పందించారు మంచు విష్ణు. ఆ వీడియోలోనే మహిళలను కించపరిచేలా వ్యవహారించిన ఆ యూట్యూబర్‌పై చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో మా అసోసియేషన్‌కు చాలా మంది నటీనటులు లేఖలు, మెయిల్స్ రాస్తున్నారని, తమ వీడియోలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు విష్ణు పేర్కొన్నారు. తన ఫొటోలు, వీడియోలను జుగుప్సాకరమైన కంటెంట్‌లో వినియోగిస్తోన్నారంటూ బ్రహ్మానందం సైతం తనకు ఫోన్ చేసి ఆవేదన పడ్డారని మంచు విష్ణు తెలిపారు. దీనికి ఎక్కడో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.