విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ, తెలుగు భాషల్లో తనదైన నటనతో అభిమానులను ఆకట్టుకుంటున్న ఆయన, ఇటీవల రామ్ చరణ్ RC 16 (వర్కింగ్ టైటిల్) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే తాజా ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వార్తలకు తెరదించారు.
తాను రామ్ చరణ్ చిత్రంలో నటించట్లేదని స్పష్టం చేసిన విజయ్ సేతుపతి, ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే సమయం తనకు లేదని తెలిపారు. అందులో నటించేందుకు అవకాశం లేకపోయినా, తెలుగు సినిమాలపై తనకు ఎంతో ప్రేమ ఉందని, మంచి కథ దొరికితే హీరోగా సైతం నటించడానికి సిద్ధమని పేర్కొన్నారు.
తెలుగు ప్రేక్షకుల ఆదరణ గురించి విజయ్ సేతుపతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఉప్పెన” సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రతో తెలుగువారిని మెప్పించిన ఆయన, భాషా భేదం తనకు లేదని, సరైన పాత్ర దొరికితే తక్షణమే తెలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధమని తెలిపారు. తెలుగు పరిశ్రమలో ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆయన నటించిన విడుదలై 2 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సూరి కీలక పాత్రలు పోషించగా, మంజూ వారియర్ మరొక ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం విడుదలై పార్ట్ 1కి కొనసాగింపుగా రానుండగా, ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగులో హీరోగా నటించే అవకాశాలపై ప్రశ్నలు ఎదురైన సమయంలో విజయ్ సేతుపతి ఆసక్తికరంగా స్పందించారు. “చాలా కథలు విన్నాను, కానీ కథలలోని హీరో పాత్ర నచ్చడం లేదు. త్వరలోనే మంచి కథ దొరికే అవకాశాలు ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో తెలుగు ప్రేక్షకుల మధ్య మరింత ఆసక్తి నెలకొంది.