ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) తుదిశ్వాస విడిచిన వార్త తెలిసి సినీ , రాజకీయ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఉదయం నుండి సినీ , రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివస్తు కడసారి రామోజీరావు ను చూసి..ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నారు.
అలాగే సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ఓం శాంతి’ అంటూ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు.
“శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు లేరనే వార్త ఆవేదన కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారన్నారు. అక్షరయోధుడు రామోజీ రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక.. కోలుకొంటారని భావించానని పవన్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనంగా మారిందని పవన్ తెలిపారు. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారన్నారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారని పవన్ తెలిపారు.
“రామోజీరావు భారతీయ మీడియా, చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేసారు.
“తన కృషితో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. 50 సంవత్సరాల నుంచి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. ‘భారతరత్న’తో ఆయనను సత్కరించడమే మనమిచ్చే ఘనమైన నివాళి” అంటూ డైరెక్టర్ రాజమౌళి పేర్కొన్నారు.
‘రామోజీరావు గారు నిజమైన దార్శనికుడు, భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ వెంకటేష్ ట్వీట్ చేసారు.