సినీ లవర్స్ కు థియేటర్స్ యాజమాన్యం షాక్ ఇచ్చారు. పెద్ద సినిమాలు లేకపోవడం, సరైన సినిమాలు రిలీజ్ అవ్వకపోవడం తో సింగిల్ థియేటర్స్ యాజమాన్యాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల పాటు థియేటర్స్ మూతవేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా వేసవి కాలం అంటే సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోల కూడా తమ సినిమాలను ఈ వేసవి సెలవులతో రిలీజ్ చేయడానికి బాగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఈ హాలిడేస్‌లో స్కూల్, కాలేజీ విద్యార్థులతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాలకు వస్తుంటారు. పైగా కలెక్షన్స్ కూడా మంచిగా వస్తుంటాయి.
కానీ ఈ సమ్మర్ సీజన్ సినీ పరిశ్రమకు భారీ ఎఫెక్ట్ చూపించింది. ఓ వైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్ ఉండటం వల్ల భారీ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్న సినిమాలే థియేటర్స్‌లో విడుదల అయ్యాయి కానీ అవి అంతగా ఆకట్టుకోవట్లేదు. అదే సమయంలో ఆడియెన్స్ కూడా పెద్దగా థియేటర్లకు రావట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ థియేటర్లకు పెద్దగా రావట్లేదు. వచ్చే కొద్ది మంది ఆడియెన్స్ ద్వారా వస్తున్న వసూళ్లు కరెంట్, రెంట్ లకు కూడా సరిపోవట్లేదని అంటున్నారు. ఈ క్రమంలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలని చవిస్తున్నారు. రాష్ట్రంలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు ఆపివేస్తామని తెలిపారు. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటం వల్లే సినిమా ప్రదర్శనలు ఆపాలని తాను నిర్ణయించినట్లు వెల్లడించారు. సినిమా ప్రదర్శనల వల్ల లాభం సంగతేమో కానీ నష్టం ఎక్కువ వస్తుందని థియేటర్ యాజమాన్యాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా ప్రదర్శనలు నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్ అద్దెలు పెంచాలన్న కోరాయి. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.