Movie News

విజయ్ ‘గోట్’ స్పెషల్ గ్లింప్స్..

తమిళ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా తన కొత్త మూవీ అయిన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ నుండి గ్లింప్స్ విడుదలై అభిమానులను సంతోష పెట్టింది. ఈ సినిమా నుండి ఒక పాటతో పాటు చిన్న గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది మూవీ టీమ్. ఇప్పటికే పాటకు సంబంధించిన ప్రోమో విడుదలయ్యి అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా విజయ్ స్పెషల్ బర్త్ డే గ్లింప్స్ అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

‘ది గోట్ బర్త్ డే షాట్స్’ పేరుతో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ నుండి విజయ్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఒక బైక్ ఛేజింగ్‌తో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. కొందరు వ్యక్తులు.. బైక్‌లో వెళ్తున్న ఇద్దరిని పట్టుకోవడానికి వెంటపడుతుంటారు. గన్ కాల్పులు కూడా జరుపుతుంటారు. చివరిగా డబుల్ ధమాకాగా విజయ్ రెండు పాత్రల్లో కనిపించడంతో ఈ గ్లింప్స్ పూర్తవుతుంది. ‘‘మునుపెన్నడూ చూడనిది చూడడానికి, మునుపెన్నడూ విననది వినడానికి, మునుపెన్నడూ కనిపించనిది కనుక్కోవడానికి సమయం వచ్చేసింది’’ అంటూ ‘గోట్’ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ గ్లింప్స్ చూస్తుంటే సినిమా పక్కా హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు.

హాలీవుడ్ రేంజ్‌లో ఆకట్టుకుంటున్న ఈ సంగీతాన్ని అందించింది యువన్ శంకర్ రాజా. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విజయ్‌కు జోడీగా మీనాక్షి చౌదరీ నటిస్తోంది. ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, వైభవ్ లాంటి నటీమణులతో పాటు లైలా, స్నేహ వంటి నటీమణులు కూడా ‘గోట్’లో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.