బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ దాడికి గురైన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారుఝామున దొంగతనం ప్రయత్నం జరుగగా ఈ దాడి జరిగింది. దుండగులు దాడి చేసి ఆయనకు కత్తి గాయాలు చేశారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్‌కు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై తెలుగు సినీ ప్రముఖుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. “సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అని ఎన్టీఆర్ తెలిపారు.
సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని సమాచారం. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ దాడి పట్ల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దుండగులను త్వరగా పట్టుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.