Movie News

బన్నీని కలిసిన ప్రముఖులు

హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన భారత సినీ చరిత్రలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో పుష్ప 2 బెనిఫిట్‌ షోకు హాజరైన అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయడం, జైలుకు తరలించడం అభిమానులకు శాకింగ్‌గా మారింది. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం ఉదయం జైలు నుంచి విడుదలైన బన్నీ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను పలువురు సినీ ప్రముఖులు కలిసి ఆయన్ను ఓదార్చారు. జూబ్లీహిల్స్‌లోని బన్నీ నివాసానికి హీరోలు విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు దిల్‌రాజు, నవీన్‌ తదితరులు వచ్చి ఆయనతో మాట్లాడారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై జరిగిన అన్యాయంపై చర్చించారు. ఈ ఘటనపై బన్నీని కలిసిన దర్శకుడు సుకుమార్‌ భావోద్వేగానికి లోనయ్యారు. అల్లు అర్జున్‌ను చూడగానే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే బన్నీ ఆయన్ని ప్రేమగా హత్తుకున్నారు. సుకుమార్‌ భావోద్వేగం పలువురి హృదయాలను తాకింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.