Movie News

గేమ్ ఛేంజర్ విశేషాలు పంచుకున్న శ్రీకాంత్

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శ్రీకాంత్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా గురించి తన అనుభవాలను పంచుకున్నారు. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమా జనవరి 10న విడుదల కాబోతోంది. ముఖ్యమంత్రి పాత్రలో శ్రీకాంత్‌ కనిపించనుండగా, ఈ పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమైనదని ఆయన తెలిపారు. శంకర్‌ చిత్రంలో నటించడం ప్రతి నటుడికీ ఒక కల అయితే, తనకు అది నిజమైనందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర అత్యంత భావోద్వేగాలతో నిండిన పాత్ర అని శ్రీకాంత్‌ చెప్పారు. మొదటగా శంకర్‌ పాత్ర వివరణ ఇచ్చినప్పుడు ఇది నాకెందుకు చెబుతున్నారా అనే అనుమానం కలిగిందని, కానీ కథ సెకెండాఫ్‌ వినాక ఈ పాత్రకు తానే సరైనవాడిని అని నమ్మకంగా ఫీల్‌ అయ్యానని వెల్లడించారు. పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్ ఉండడం తనకు ప్రత్యేకమైన అనుభూతి కలిగించిందన్నారు.

శ్రీకాంత్‌ పాత్ర కోసం ప్రాస్థెటిక్‌ మేకప్‌ డిజైన్‌ చేయడం చాలా సమయం తీసుకున్నదని తెలిపారు. ఒక్క మేకప్‌కి నాలుగు గంటల సమయం పట్టేదని, మేకర్స్‌ తన నాన్నగారి ఫోటో ఆధారంగా గెటప్‌ను డిజైన్‌ చేశారని చెప్పారు. మేకప్‌ వేసుకున్న తర్వాత తాను నిజంగా ఆ పాత్రలో జీవించానని, ప్రత్యేకంగా ఎలాంటి ప్రిపరేషన్‌ అవసరం లేకుండా ఎక్స్‌ప్రెషన్స్‌ స్వయంగా వచ్చాయని చెప్పారు.

తన గెటప్‌ను చూసి మొదట తన తల్లి ఆశ్చర్యపోయారని శ్రీకాంత్‌ గుర్తు చేసుకున్నారు. ఆమె రియాక్షన్‌ చూసినప్పుడు గెటప్‌ ఎంతో సహజంగా కుదిరిందని అర్థమైందని తెలిపారు. సినిమాలో రామ్‌ చరణ్‌, జయరామ్‌, ఎస్‌.జె. సూర్య, సముద్రఖని వంటి ప్రముఖ నటులతో కలిసి పని చేయడం ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు. రామ్‌చరణ్‌ ఇప్పుడొక గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారని, అప్పన్న పాత్రలో ఆయన నటన అందరిని ఆశ్చర్యపరుస్తుందని పేర్కొన్నారు.

శంకర్‌ తీసిన సినిమాలు ఎప్పుడూ బలమైన సోషల్‌ మెసేజ్‌ ఉంటాయనీ, ఈ సినిమా కూడా రాజకీయం మరియు సామాజిక అంశాలను హైలైట్‌ చేస్తుందని శ్రీకాంత్‌ చెప్పారు. డైరెక్టర్‌గా శంకర్‌ ఎప్పుడూ విఫలం కాలేదని, ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన నమ్మకంగా తెలిపారు. సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.