Categories: News

ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

హైదరాబాద్ భక్తులను పరవశింపజేసేందుకు శ్రీవారి కళ్యాణం సిద్ధమవుతోంది. భక్తకోటి కనుల పండుగగా టీటీడీ ఆధ్వర్యంలో, మహాగ్రూప్స్ అధినేత మారెళ్ల వంశీకృష్ణ సంకల్పంతో గచ్చిబౌలి స్టేడియంలో నవంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటలకు శ్రీనివాస కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. త్రైలోక సుందరుడైన శ్రీవారికి జరగబోయే ఈ దివ్య కళ్యాణానికి సంబంధించిన పవిత్ర పోస్టర్‌ను వంశీరామ్స్ బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి, అపర్ణ గ్రూప్ చైర్మన్ సీవీ రెడ్డి, సుచిర్ ఇండియా అధినేత కిరణ్, స్వగృహ చైర్మన్‌ బీపీ నాయుడు, టీమ్‌ 4 అధినేత యార్లగడ్డ మురళి, మహాగ్రూప్‌ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ సహా పలువురు ఇటీవల ఆవిష్కరించారు. పతిత పావనుడి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఈ సందర్భంగా మహాన్యూస్ సిఎండీ మారెళ్ల వంశీకృష్ణ మాట్లడుతూ… “తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియం నందు నవంబర్ 26వ తేదీన సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము” అన్నారు.