Movie News

చైతూ భర్తగా రావడం నా అదృష్టం.. శోభిత ధూళిపాళ

తాజాగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట త‌మ ప్రేమకథను అందరి ముందుకు తెచ్చి అభిమానులను ముచ్చటగొలిపారు. శోభిత తన జీవితానికి చైతన్య లాంటి జీవిత భాగస్వామి దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. చైతూ సింప్లిసిటీ, దయ, ఇతరుల పట్ల మర్యాద వంటి లక్షణాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. చైతన్య తనను ఎంతో ప్రేమిస్తాడని, జీవితంలో తనకు అద్భుతమైన తోడు అని ఆమె ప్రశంసించారు. తనకు చిన్ననాటి నుంచే భక్తి చాలా ఉందని, ఆలయ సందర్శనలో ఆధ్యాత్మిక ప్రశాంతత పొందుతానని శోభిత అన్నారు. మనసు బాగాలేకపోతే ఆలయంలో కొంత సమయం గడిపేందుకు ఇష్టపడతానని చెప్పారు. కూచిపూడి, భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగి ఉన్న శోభిత డ్యాన్స్ పట్ల తమ ప్రేమను పంచుకున్నారు. పుస్తకాలు చదవడం, కవితలు రాయడం, వంటవంటలు చేయడం ఆమెకు చాలా ఇష్టమని తెలిపారు. తాను చేసిన ఆవకాయ, పులిహోర, ముద్దపప్పు ఎవరైనా తినకుండా ఉండలేరని చెప్పడంలో ఆమె ఆత్మవిశ్వాసం కనిపించింది.

కెరీర్ ప్రారంభంలో తిరస్కరణలు ఎదురైనప్పటికీ, వాటిని అధిగమించడానికి పట్టుదలతో ప్రయత్నించానని శోభిత చెప్పారు. ముఖకవళికలు ఆకర్షణీయంగా లేవని నేరుగా తనకు చెప్పిన అనుభవాలను ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించగలిగినందుకు గర్వంగా ఉందని చెప్పారు. తనకు నచ్చిన పాత్రలే చేస్తానని, తెరపై కనిపించడం కోసం మాత్రమే సినిమాలు చేయనని శోభిత తెలిపారు. విభిన్నమైన కథలలో, తనకు సవాళ్లను విసురే పాత్రల్లో నటించడం తన లక్ష్యమని చెప్పిన ఆమె, ప్రేక్షకులను కొత్త అనుభూతులకు గురిచేయడమే తన అభిమతమని పేర్కొన్నారు.