Movie News

‘డాకు మహారాజ్’ చిత్రం: తెలుగు సినీ అభిమానుల ఎదురు చూపు!

తెలుగు సినిమా అభిమానులు, ముఖ్యంగా నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం డాకు మహారాజ్. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. బాలకృష్ణతో పాటు శ్రద్ధా శ్రీనాథ్ మరియు ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

‘డాకు మహారాజ్’ సినిమాలో తన పాత్ర గురించి శ్రద్ధా శ్రీనాథ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

బాలకృష్ణ గారి గురించి

“నేను అనేక సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నా, బాలకృష్ణ గారిలో ‘నేను బిగ్ స్టార్’ అనే అహం ఎప్పుడూ కనిపించలేదు. సెట్స్‌లో ఆయన అందరితో సరదాగా ఉంటారు. తనకంటే చిన్నా పెద్దా అని చూడకుండా, ఆయన దర్శకుడికి ఎంతో గౌరవం ఇస్తారు. సినిమా కోసం ఆయన ఏం చెప్తే, అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.”

‘డాకు మహారాజ్’ లో నటించడం ఎలా అనిపించింది?

“నేను ఇప్పటివరకు కొన్ని విభిన్న సినిమాలు చేశాను. అయితే, ‘డాకు మహారాజ్’ ఒక పూర్తి ప్యాకేజ్ లా ఉంటుంది. ఇందులో కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. బాలకృష్ణ గారి సినిమాలో నటించడం వల్ల నాకు ప్రేక్షకులకు నా ప్రతిభను చూపించే మంచి అవకాశం లభిస్తోంది.”

మీ పాత్ర గురించి

“నా పాత్ర పేరు నందిని. ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ఎంతో ఓపిక ఉంటుంది. అదే సమయంలో ఎప్పుడు మాట్లాడాలో స్పష్టంగా తెలుసుకుంటుంది. నా పాత్రలో డెప్త్ కూడా ఉంది, ఇందులో నటనకు చాలానే అవకాశాలు ఉన్నాయి.”

‘డాకు మహారాజ్’ మీ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపించనుంది?

“ఈ చిత్రంపై నాకు ఎంతో నమ్మకముంది. నందిని పాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతానని నమ్ముతున్నాను.”

ఈ చిత్రంలో మీకు ఎలాంటి ఛాలెంజింగ్ అంశం ఎదురైంది?

“నటిగా ఈ సినిమా నాకు ఎంతో నేర్పింది. ముఖ్యంగా డైలాగ్ లు కరెక్ట్ మెజర్‌లో ఉండాలని భావించి, వాటి మీద ఎంతో కేర్ తీసుకుని డబ్బింగ్ చెప్పాను. అది చేయడానికి ఎక్కువ సమయం పట్టింది.”

దర్శకుడు బాబీ గారి గురించి

“బాబీ గారు ప్రతిభావంతులైన దర్శకుడు. ఆయనకు సినిమాపట్ల ఎంతో పాషన్ ఉంది. ఆయన మంచి నటుడూ కూడా. అద్భుతమైన సూచనలు ఇస్తూ, నటీనటుల నుంచి మంచి నటనను తీసుకొస్తారు.”

మీకు ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది?

“అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు చేయడం నాకు ఎక్కువ ఇష్టం.”