నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “పుష్ప 2” (Pushpa 2: The Rule). ఇండియా వైడ్ వైల్డ్ ఫైర్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “బాహుబలి 2” తర్వాత ఆస్థాయి ఆసక్తి రేకెత్తించిన సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను సుకుమార్ & అల్లు అర్జున్ కలిసి అందుకోగలిగారా? సినిమా ఆడియన్స్ ను ఏమేరకు అలరించింది? అనేది చూద్దాం..!!
స్టోరీ :
ఏ సినిమాకి అయినా కథే హీరో. ఎంతపెద్ద చాష్త్ & క్రూ ఉన్నా కూడా కథలో దమ్ము లేకపోతే ఎంతమంది దర్శకధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ ‘పుష్ప-2’ కథానాయకుడి రూలింగ్‌నే కథగా మలిచారు సుకుమార్. ‘పెళ్లం మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో పపంచానికి చూపిస్తా’ అని పుష్ప ట్రైలర్‌లో చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు.. అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం. పుష్ప రాజ్ (అల్లు అర్జున్) తన భార్య శ్రీవల్లి (రష్మిక)కి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు? పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేతంట రూలింగ్ చేసి.. రాజకీయాలను ఏవిధంగా శాసించాడు? పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షేకావత్(ఫహాద్ ఫాజిల్)తో ఢీ కొట్టి.. తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు? తన ఇంటిపేరును దక్కించుకోవడం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ.
కాస్ట్ & క్రూ తీరు :
అల్లు అర్జున్ నటుడిగా “పుష్ప”తోనే నేషనల్ అవార్డ్ అందుకున్నాడు కానీ.. నిజానికి “పుష్ప 2”(Pushpa 2: The Rule)లో నటనకి ఇంకా పెద్ద అవార్డ్ ఇవ్వాలి. పుష్పరాజ్ పాత్రలోని కసి, ఆ పాత్ర తాలుకు స్వభావాన్ని పుణికిపుచ్చుకొన్నట్లుగా పూనకంతో ఊగిపోయాడు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ లో కన్నీరు పెట్టుకుంటూ “నాకు ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నాను” అనే సీన్ లో అల్లు అర్జున్లో ని పూర్తిస్థాయి నటుడు బయటపడ్డాడు. ఇక అదే జాతర సీక్వెన్స్ లో వచ్చే అమ్మోరు తల్లి పాట మరియు ఓల్డ్ ఫోర్ట్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ రుద్రతాండవడం అనేది కొన్నేళ్లపాటు చెప్పుకొనే స్థాయిలో ఉంది.
నటుడిగా అల్లు అర్జున్ ని మరో స్థాయికి తీసుకెళ్ళే చిత్రమిది. ముఖ్యంగా బీహార్ మార్కెట్ లో బన్నీకి తిరుగులేని స్టార్ డమ్ క్రియేట్ చేయడమే కాక నార్త్ లో బన్నీకి చిరకాలం గుర్తుండిపోయే పేరు తీసుకొస్తుంది ఈ చిత్రం. సినిమా మొత్తం పుష్పరాజ్ గాడి కసి కనిపిస్తుంది, ఆ కసితోనే ప్రేక్షకుడు సినిమా చూస్తుంటాడు. ఒక నటుడిగా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి ఇదే నిదర్శనం. సాధారణంగా ఈ తరహా మాస్ ఎంటర్టైనర్స్ లో హీరోయిన్స్ కి పాటలు మినహా పెద్ద రోల్ ఏమీ ఉండదు. కానీ.. ఈ చిత్రంలో రష్మిక పోషించిన శ్రీవల్లి పాత్ర చేసే మోటు సరసం కాస్త ఇబ్బందిపెట్టినా.. భర్తను ఒక్క మాట అన్నా ఊరుకోని సగటు గృహిణిగా ఆమె పాత్ర స్వభావం కానీ, రష్మిక నటన కానీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక పీలింగ్స్ పాటలో రష్మిక ఊరమాస్ డ్యాన్స్ స్టెప్స్ కి బాల్కనీ ఆడియన్స్ కూడా ఊగాల్సిందే.
ఫహాద్ ఫాజిల్ కి ఈసారి కాస్త స్క్రీన్ టైమ్ ఎక్కువ లభించింది. అయితే.. అతడి క్యాలిబర్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు అనిపిస్తుంది. స్విమింగ్ పూల్ సీన్ & వైల్డ్ ఫైరు సీక్వెన్స్ లో అతడ్ని మరీ కమెడియన్ లా చూపించేయడంతో.. పుష్పరాజ్ గాడ్ని బలంగా ఢీకొనే ప్రతినాయకుడు లేకుండాపోయాడు. ఫస్ట్ పార్ట్ లో చాలా పవర్ ఫుల్ గా చూపించిన సునీల్ ను సెకండ్ పార్ట్ లో కమెడియన్ చేసేశారు. రావు రమేష్ మరోసారి తన సత్తాను ఘనంగా చాటుకున్నాడు. పోలీస్ స్టేషన్ సీన్ లో అతడి పెక్యులియర్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
జగపతిబాబు పాత్రను పూర్తిగా పరిచయం చేయలేదు కానీ.. అసలు మెయిన్ విలన్ కోగటం వీరప్రతాప్ పాత్ర అని మాత్రం అర్థమవుతుంది. ఈ వీరప్రతాప్ ఏం చేస్తాడు అనేది తెలియాలంటే మూడో భాగం కోసం వెయిట్ చేయాలన్నమాట. ఇక అజయ్ మొదట్లో కోపిష్టి అన్నయ్యగా మాత్రమే కనిపించినా.. చివర్లో పండించే సెంటిమెంట్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. తారక్ పొన్నప్ప పాత్ర చిన్నదే కానీ.. దాని ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంది. ఇక శ్రీలీల స్పెషల్ సాంగ్ లో కైపెక్కించే డ్యాన్స్ మూమెంట్స్ తో కుర్రకారును కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసింది.
ఈ సినిమాకి ప్రధానమైన మైనస్ అంటే క్లైమాక్స్. 3.20 నిమిషాలు పుష్ప రూల్ చూసిన తరువాత.. పార్ట్ 3 కోసం కథను అర్ధాంతరంగా ముగించినట్టు అనిపిస్తుంది. అసలు రూల్ బ్రేకరే లేని ది రూల్‌కి ఒక్కసారిగా స్పీడ్ బ్రేక్ వేసి.. మిగతాది ‘పుష్ప ది రాంపేజ్’ పార్ట్ 3లో చూసుకోండని అలా వదిలేయడం ప్రేక్షకులకు అసంతృప్తిగా అనిపిస్తుంది. విస్తరి మొత్తం వడ్డించి.. ఇక తిన్నది చాల్లే లేవండి.. మిగతాది థర్డ్ పార్ట్‌లో తినొచ్చు అన్నట్టుగా బలవంతంగా కుర్చీలలో నుంచి లేపినట్టు అనిపిస్తుంది.ఈ క్లైమాక్స్ కోసమా 3.20 గంటలు వేచి చూసింది అనే పెదవి విరుపులు అయితే ఖచ్చితంగా అనిపిస్తాయి.
ఓవరాల్‌గా.. సినిమా మొత్తాన్ని అల్లు అర్జున్ బ్రతికించాడు..అల్లు అర్జున్ తోనే సినిమా నిలబడిందని చెప్పాలి. పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 లో కథ ఏమిలేదు. జస్ట్ హీరో ఎలివేషన్స్ , సాంగ్స్ తప్ప..బన్నీ యాక్టింగ్ కోసం సినిమా చూడొచ్చు..అంతే.