ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప-2: ది రూల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కొల్లగొట్టింది. గతేడాది డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్ గా విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 1,871 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు మేకర్స్ కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని మేకర్స్ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రూ. 294 కోట్లు గ్రాస్ వసూలు చేసి మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఇండియన్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ దాటింది. అనంతరం ఆరు రోజుల్లోనే రూ. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
మూవీని లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రస్తుతం కొన్ని థియేటర్లతో పాటు నెట్‌ఫ్లిక్స్ లోనూ పుష్ప-2 స్ట్రీమింగ్ అవుతోంది.