ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప 2’ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. సినిమా విడుదలై 10 రోజులు గడిచినా వసూళ్ల వేగం తగ్గకపోవడం విశేషం. పదో రోజు ఒక్క రోజులోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రలో నిలిచింది.
‘పుష్ప 2’ హిందీ వెర్షన్ అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి మరో మైలురాయిని అందుకుంది. ఇప్పటివరకు పది రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్లలో రూ.507.50 కోట్లు వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికాలోనూ పుష్ప మేనియా కొనసాగుతూ, ఇప్పటివరకు 12.3 మిలియన్ల డాలర్ల వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సినిమా రూ.1100 కోట్ల మార్క్‌ను దాటింది.
డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో ఆరు భాషల్లో రిలీజ్ అయిన ‘పుష్ప 2’, అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయపథంలో దూసుకుపోతోంది. 2021లో విడుదలైన ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందించబడింది. రష్మిక మంధన్నా, ఫాహద్ ఫజిల్, జగపతిబాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.
సినిమాలో అల్లు అర్జున్ నటన ప్రత్యేకంగా ప్రశంసలందుకుంటోంది. గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్‌లో ఆయన నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బన్నీ, రష్మిక స్టెప్పులు పాటలతో పాటు సినిమాకి ప్రాణంగా నిలిచాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, అల్లు అర్జున్ కెరీర్‌లోనే కాకుండా భారతీయ చిత్రపరిశ్రమలో కూడా ఓ ప్రత్యేక ముద్ర వేసింది. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపిస్తూ సినిమా విజయాన్ని మరింత పటిష్టం చేస్తున్నారు. ‘పుష్ప 2’ సృష్టించిన రికార్డులు, వసూళ్ల జోరు ఇండస్ట్రీలో సరికొత్త స్టాండర్డ్స్‌ను నెలకొల్పాయి.