ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి బుధవారం స్వర్గస్తులయ్యారు. ఈమె దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తే. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి మరణించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మి మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సోదరి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఉదయమే హైదరాబాద్ బయలుదేరి వెళ్లారట.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి విషయానికి వస్తే..ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వివిరామంగా కొనసాగుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అదే చానల్లో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ జోడి షో , జీన్స్, అదుర్స్ , క్యాష్ , స్టార్ మహిళ వంటి కార్యక్రమాలకు నిర్మాతగా వ్యవహరించారు..వ్యవహరిస్తున్నారు. ఈయన నిర్మించిన సినిమాల విషయానికొస్తే.. అమ్మోరు, అరుంధతి, అంజి లాంటి చిత్రాలు ఈయన గ్రాఫికల్ ప్రవాహానికి అద్దం పడతాయి. ఒకసారి టర్మినేటర్ -2 జడ్జిమెంట్ డే అనే సినిమా చూసిన ఈయన, తెలుగులో కూడా ఇలాంటి చిత్రాలు ఎందుకు చేయకూడదు అని ఆలోచించారట. ఆ ప్రేరణతోనే ఆయన మొదటి గ్రాఫికల్ చిత్రంగా అమ్మోరు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు చిరంజీవి హీరోగా వచ్చిన అంజి సినిమా కథపరంగా డిజాస్టర్ అయినా ఇందులో గ్రాఫికల్ ఎఫెక్ట్స్ కి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డు కూడా లభించింది.