Movie News

అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు

ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్‌కు పోలీసులు విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశించారు. ఇటీవల పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నారు.

సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ హాజరుకావడంతో భారీ జనసందోహం ఏర్పడి తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అల్లు అర్జున్‌ను కేసులో ఏ11గా పేర్కొన్నారు. తొలుత అరెస్టు చేసిన పోలీసులు, చంచల్ గూడ జైలులో ఓ రాత్రి ఉంచి అనంతరం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఆధారంగా విడుదల చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై అసెంబ్లీలో ప్రకటన చేయడం, అల్లు అర్జున్ ప్రవర్తనపై విమర్శలు చేయడం రాజకీయంగా కూడా దుమారం రేపింది. పోలీసులు అతడిని థియేటర్ నుంచి వెళ్లమని చెప్పినా, అల్లు అర్జున్ అనుసరించిన తీరుపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విలేకర్ల సమావేశంలో మాట్లాడిన అల్లు అర్జున్, తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను చుట్టూ జరుగుతున్న వివాదాలను తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటన తనకు తీవ్ర భావోద్వేగాలను కలిగించిందని చెప్పిన అల్లు అర్జున్, అసలైన విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. మంగళవారం నోటీసుల మేరకు అల్లు అర్జున్ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం ఉత్కంఠ రేపుతోంది. పోలీసుల విడుదల చేసిన వీడియోలు, సంఘటనకు సంబంధించిన కీలక ఆధారాలు ఈ కేసు విచారణను మలుపు తిప్పే అవకాశముంది.