ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్రసాంకేతిక, అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఛాంబర్ లో పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం పవన్ కల్యాణ్ కు ఆశీర్వచనాలు అందించారు. ఆ తరువాత చాంబర్ లో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించి.. పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉప ముఖ్యమంత్రిగా తొలిసారి అడుగు పెట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
పవన్ కళ్యాణ్ వెంట ఆయన సోదరుడు, జనసేన పార్టీ నేత నాగబాబు, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత.. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీకృష్ణ, టీడీపీ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ నేతలు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో సినీ నటుడు, జనసేన నేత పృథ్వీ కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించి పవన్ కల్యాణ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కానున్నారు. గ్రూప్ వన్, గ్రూప్ టు ఆఫీసర్లతో సమావేశం అవుతారు. పంచాయతీ సెక్రెటరీ అసోసియేషన్ నాయకులతో సమావేశం అనంతరం మంగళగిరి పార్టీ ఆఫీస్ కు పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. రాత్రి మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నారు. రేపటి నుంచి పవన్ కల్యాణ్ తన పరిధిలో ఉన్న శాఖలపై పూర్తిగా దృష్టిపెట్టనున్నారు