మెగా కుటుంబంలో అల్లు అర్జున్ రేపిన చిచ్చు అంతా ఇంతా కాదు. ఎప్పటి నుంచో బన్నీ తీరు వివాదాస్పదమవుతుండగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అది తారాస్థాయికి చేరింది. పవన్ కళ్యాణ్ కు కానీ ఆయన మద్ధతు పలికిన కూటమి కోసం అల్లు అర్జున్ నోరు విప్పలేదు. కానీ వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డిల తరపున ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి కొద్దిగంటల్లో సమయం ముగుస్తుందనగా నంద్యాలలో భార్య స్నేహారెడ్డితో ల్యాండైన అల్లు అర్జున్.. శిల్పా రవిని గెలిపించాలని కోరారు.
పవన్ గెలిచిన తర్వాత ఆయనకు విషెస్ తెలియజేస్తూ అల్లు అర్జున్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, అల్లు అరవింద్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్దా విజయవాడ తరలివెళ్లారు. ఈ బ్యాచ్‌లోనూ అల్లు ఫ్యామిలీ జాడ లేదు. ఇలా ఇవన్నీ చూసి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ .. తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అల్లు అర్జున్, స్నేహారెడ్డిలను అన్‌ఫాలో కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాయిధరమ్ తేజ్.. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిలను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడంపై మెగా డాటర్ నిహారికపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. బన్నీని సాయితేజ్ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసిన విషయం తనకు తెలియదని, అయితే ఎవరికి కారణాలు వారికి ఉంటాయని నిహారిక వ్యాఖ్యానిస్తూ తెలివిగా తప్పించుకుంది.