టాలీవుడ్‌లో మంచు కుటుంబంలో చెలరేగిన వివాదంపై నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. ఈ పరిణామాలను తీవ్ర దురదృష్టకరంగా అభివర్ణిస్తూ, మంచు కుటుంబానికి నర ఘోష తగిలినట్టుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో మంచు కుటుంబానికి ఉన్న మంచి పేరును ఇలాంటి సంఘటనలు మచ్చగొడతాయని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని నట్టి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మోహన్ బాబు సినీ కెరీర్ వచ్చే ఏడాది 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ప్రత్యేకమని నట్టి కుమార్ కొనియాడారు. విలన్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోగా ఎదిగిన మోహన్ బాబు అనేక విభిన్న పాత్రలు పోషించి, ఎన్నో అవార్డులు అందుకున్నారని ఆయన తెలిపారు. దాసరి నారాయణరావు తర్వాత సూటిగా మాట్లాడే వ్యక్తి మోహన్ బాబు మాత్రమేనని, ఇది అందరూ ఒప్పుకునే విషయం అని చెప్పారు.
మంచు కుటుంబ సభ్యులు విష్ణు, మనోజ్, లక్ష్మి మంచి వ్యక్తులని, ఇతరులకు సహాయం చేయడంలో ముందుండే వారి కుటుంబం ఇలాంటి సమస్యల్లో ఇరుక్కోవడం దురదృష్టకరమని అన్నారు. కుటుంబాల్లో చిన్న గొడవలు సహజమేనని, కానీ వీటిని పక్కన పెట్టి సమస్యలను పరిష్కరించుకోవాలన్న నట్టి కుమార్ సూచించారు.
మోహన్ బాబుకు కుటుంబంలో తగిన మార్గదర్శకత్వం ఇవ్వగల దాసరి నారాయణరావు లేని పరిస్థితిలో, కుటుంబ సమస్యలను పరిష్కరించగల శక్తి ఒక్క మోహన్ బాబుకే ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులు ఈ గొడవలను పక్కనపెట్టి, 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.