సీనియర్ నటుడు మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సమస్యల కారణంగా ఆరోగ్య క్షించడంతో, ఆయనను పెద్ద కుమారుడు మంచు విష్ణు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు తగిన చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. కుటుంబ పరిణామాలు మోహన్ బాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.
మరోవైపు, మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పలువురు జర్నలిస్టులు కాంటినెంటల్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మోహన్ బాబు తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. టాలీవుడ్‌లో ఈ పరిణామాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మోహన్ బాబు కుటుంబ గొడవలు ఇప్పటికే చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతుండగా, జర్నలిస్టులపై దాడి జరగడం మరింత అభాసుపాలు చేసింది. కుటుంబ సమస్యలను పక్కన పెట్టి, సమస్యను సున్నితంగా పరిష్కరించాలని సినీ ప్రముఖులు సూచిస్తున్నారు.