తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 50వ సినిమాగా మహారాజ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, అభిరామి, మమతా మోహన్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ఈ సినిమాని నిర్మించారు. తెలుగులో మహారాజ సినిమా ఎన్‌విఆర్ సినిమా ద్వారా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా మూవీని గురించి నెటిజన్లు తమ అభిప్రాయాలను, రివ్యూలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటున్నారు.
ఓ భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్. కర్మ సిద్ధాంతం అనే పాయింట్‌తో ముడిపడి ఉంటుంది. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపారు. విజయ్ సేతుపతి విలక్షణమైన యాక్టింగ్ హైలైట్. సరదా సరదాగా మొదలై ఊహలకు అందని ట్విస్టులతో ఎమోషనల్‌గా కథ ముగుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వచ్చే ట్విస్టులు, సేతుపతి యాక్షన్ హంగామా సూపర్‌గా ఉంటాయి అని నెటిజన్లు చెపుతున్నారు. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ భాగం పాత్రల పరిచయాలే ఉంటాయి. కానీ బోర్ కొట్టిన ఫీల్ కలగదు. మొదట్లో ఒకదానితో మరొకటి సంబంధం లేని వేరువేరు ఎపిసోడ్స్‌లా కనిపించినా ఇంటర్వెల్ సమయానికి అన్నింటి మధ్య ఏదో లింక్ ఉన్నట్లు అర్థమవుతుంది. అందుకు తగ్గట్లుగానే ఓ థ్రిల్లింగ్ సీక్వెన్స్‌తో క్లోజ్ చేసిన ఇంటర్వెల్ సీన్ మెప్పిస్తుంది.
ఇక అనూహ్యమైన మలుపులతో సెకండాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. బిడ్డ విషయంలో మహారాజాకు జరిగిన నష్టం అందర్నీ షాక్‌కు గురిచేసి ప్రతి ఒక్కరి మదిని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్‌లో బాధిత యువతిగా మెయిన్ విలన్‌తో జ్యోతి చెప్పే డైలాగ్స్ స్ఫూర్తి రగిలించేలా ఉంది. ఓవరాల్ గా సినిమా సూపర్బ్ గా ఉందని అంటున్నారు.