సినిమా వార్తలు

‘మా’ లో నిధులు దుర్వినియోగం జ‌ర‌గ‌లేదు.. నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం తప్పు: ‘మా’ అధ్య‌క్షుడు వి.కె.నరేశ్‌

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌(మా)’ ఎన్నిక‌లు, నిధుల ఉప‌యోగంపై ఉపాధ్య‌క్షురాలు హేమ ఇటీవ‌ల ఓ ఛానెల్ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఆరోప‌ణ‌లు ఖండిస్తూ, ‘మా’ అధ్య‌క్షుడు వి.కె.న‌రేశ్‌, కార్య‌ద‌ర్శి జీవితా రాజ‌శేఖ‌ర్ సోమ‌వారం రోజున ఓ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో…

VK Naresh MAA ( Movie Artist Association ) President

‘మా’ అధ్య‌క్షుడు వి.కె.నరేశ్‌ మాట్లాడుతూ ‘‘ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌మంతా ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో అంద‌రికీ తెలిసిందే. కరోనా థర్డ్‌వేవ్‌ భయం ఉన్న సమయంలో ఎక్కువమంది గుంపులుగా చేర‌డం కరెక్ట్‌కాదని, ఈ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికలు నిర్వహిస్తే సుప్రీం కోర్ట్‌ నుంచి పలు రాష్ట్రాల హైకోర్టులు మర్డర్‌ చార్జెస్‌ కింద తగు చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల ‘మా’ ఎన్నికలు ఎప్పుడనేది ఆగస్ట్‌ 22న జరిగే జనరల్‌ బాడీ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో జనరల్‌ బాడీ మీటింగ్‌ కూడా వర్చువల్‌గానే జరగుతుంది. అకౌంట్స్‌కు సంబంధించి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏక్రగ్రీవంగా ఆమోదించిందించిన‌ప్ప‌టికీ అసోసియేషన్‌ తీరు మీద హేమ చేసిన వ్యాఖ్యలు బాధాకరం. ఆమె వాయిస్‌ లీక్‌ కావడం, అందులో ‘మా’ ఫండ్స్‌ దుర్వినియోగం చేస్తున్నామనీ, ‘మా’ దివాళ తీస్తుందనే భయానక మాటలకు అంద‌రం షాక‌య్యాం. క‌రోనా ప‌రిస్థితుల్లో ఎలాంటి ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేదు.

అయితే మాకున్న సోర్సెస్ ద్వారా..మెంబర్‌ షిప్‌ ద్వారా రూ. 84లక్షల ఆదాయం వచ్చింది. జీవితా రాజ‌శేఖ‌ర్‌గారు రూ.10లక్షలు ఇచ్చారు. అలాగే దీంతో పాటు రూ.14 లక్షలను నేనే స్వయంగా డిపాజిట్‌ చేశాను. కరోనా సమయంలో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి, హెల్త్‌ ఇన్సూరెన్స్‌కి కలిపి దాదాపు కోటి రూపాయిలు ఉపయోగించాం. మా ద‌గ్గ‌ర ఆధారాలున్నాయి. ఇప్పుడు ఫండ్స్‌ దుర్వినియోగం అవుతున్నాయని హేమ‌గారు చెప్పిన‌ మాట మనసుకిచాలా బాధ కలిగించింది. మాకున్న ఇమేజ్‌తో ఈ టర్మ్‌లో ఒక కోటి రూపాయ‌లు ఫండ్‌ తీసుకొచ్చాం. ఎక్కడా రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదు. నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం తప్పు. హేమ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని క్రమశిక్షణా సంఘానికి తెలియపరిచాం. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే దానిని ఆమోదిస్తాం. మూడు టర్మ్‌లుగా జరుగుతున్న ఆర్ధిక లావాదేవీలను అంద‌రికీ వివ‌రిస్తాం. పరుచూరి గోపాలకృష్ణగారి సలహాతో మార్చిలో జరగాల్సిన ఎన్నికల్ని అందరి ఆమోదంతో సెప్టెంబర్‌కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడనేది నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపారు.