Movie News

బన్నీ కి జోడీగా లక్కీ బ్యూటీ?

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త ప్రాజెక్టు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. వీరిద్దరి కలయికలో గతంలో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ వంటి భారీ విజయాలను అందుకున్నారు. ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే బన్నీని ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసాయి. ఇప్పుడు మరో సినిమా సెట్స్ పైకి రాబోతుండడంతో అందరిలో అంచనాలు మొదలయ్యాయి.

ఈ కొత్త సినిమాకు సంబంధించి కథానాయికగా పూజ హెగ్డే పేరు మొదట వినిపించింది. ‘అల వైకుంఠపురములో’ లో పూజ మరియు బన్నీ నటించిన జోడి పెద్ద విజయాన్ని సాధించగా, ఈ జంట తిరిగి కలిసే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి కెరీర్లో మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ విజయ్, మహేశ్ బాబు, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో చేసిన సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఆమె నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

ఇప్పుడు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఆమె వెంకటేశ్ తో కలిసి నటిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, త్రివిక్రమ్ ఆమెను తన కొత్త ప్రాజెక్టులో ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.