ప్రముఖ సినీ నటుడు, దర్శక,నిర్మాత ఆర్. నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు గురై..నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్థానికంగా ఉండే వైద్యుల పర్వవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకోకపోగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. దాంతో ఆయనను నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని వైద్య వర్గాలు వెల్లడించాయి. పలువురు వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు అని వైద్యులు తెలిపారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకొన్న ఆయన రెండు రోజులుగా నీరసంగా ఉన్నారు. దాంతో ఆయనను హాస్పిటల్‌లో చేర్పించి తన సోదరుడు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. వైద్యులు పలు టెస్ట్‌లు చేసి తగిన ట్రీట్‌మెంట్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ఉదయం నారాయణమూర్తి కి ఫోన్ చేసి పరామర్శించారు. ఆర్ నారాయణ మూర్తికి అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా విప్లవ సినిమాలతోపాటు సామాజిక నేపథ్యం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తూ పీపుల్స్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆర్ నారాయణమూర్తి. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు అభిమానులు.