కిరణ్ అబ్బవరం..ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ఆరంభించి ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే ఆకట్టుకోగా, SR కళ్యాణమండపం అనే సినిమాతో సక్సెస్ ని అందుకున్నాడు. ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించి రచయితగా తనలోని టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం, భారీ ప్లాప్ లను అందుకుని డీలా పడ్డాడు. కిరణ్. లాస్ట్ ఇయర్ మొదట్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఓ మోస్తరు హిట్ ని అందుకున్న కిరణ్ మళ్ళీ డిజాస్టర్లు అందుకున్నాడు. మంచి అంచనాలతో వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేయాలనీ చూస్తున్నాడు.
తాజాగా కిరణ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. “క” (KA) అనే టైటిల్ ని పెట్టడం జరిగింది. ఈరోజు కిరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ‘ఎవరు నువ్వు.. ఎక్కడి నుంచి వచ్చావ్, పక్కవాళ్ల ఉత్తరాల చదివే అలవాటేంటి నీకు’ అనే ప్రశ్నలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. విజువల్స్ చూస్తే కిరణ్ అబ్బవరం క్యారెక్టర్‌పై ఓ అంచనాకు వస్తారు. తనో పోస్ట్‌మెన్. ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఊర్లోవాళ్లకు వచ్చిన ఉత్తరాలు చదవడం ప్రారంభిస్తాడు. ఆ ఉత్తరాలే అతని జీవితాన్ని మార్చివేస్తాయి. అదెలా? అనేది తెరపై చూడాలి. టీజర్ చూస్తే ఈ సినిమాలో చాలా జోనర్లు మిక్స్ అయినట్టు అనిపిస్తోంది. ఆర్ట్, సెట్ వర్క్, కెమెరా పనితనం పిరియాడిక్ లుక్‌ని తీసుకురావడంలో సఫలం అయ్యాయి. ముఖ్యంగా విజువల్స్ ఆకట్టుకొన్నాయి. కాంతార, పుష్ష ప్రభావం ‘క’పై ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. శ్యామ్ సి ఇచ్చిన ఆర్.ఆర్ అదనపు ఆకర్షణ. కిరణ్ ఈసారి కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడన్న భరోసా ఈ టీజర్ తో కలిగింది.