విలక్షణ దర్శకుడు అట్లీ తన సినిమాల విజయాలతో అందరిచేత ప్రశంసలు అందుకుంటూనే ఉంటాడు. కానీ, పలు సందర్భాల్లో తన లుక్ విషయంలో ట్రోల్స్‌కి గురి అవుతుంటాడు. ఇటీవల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ జవాన్ సక్సెస్‌తో తన ప్రతిభను మరోసారి చాటుకున్న అట్లీ, తాజాగా మరోసారి విమర్శల బారిన పడ్డాడు. అయితే, ఈ విమర్శలకు గట్టి కౌంటర్ ఇస్తూ తన ధైర్యాన్ని చాటుకున్నాడు.
అట్లీ ప్రస్తుతం తన తాజా చిత్రం బేబీ జాన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్నాడు. అయితే షో హోస్ట్ కపిల్ శర్మ తన లుక్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడంతో, అది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కపిల్ మాట్లాడుతూ .. “మీరు కథ చెప్పడానికి హీరోను కలిసినప్పుడు, వాళ్లు ‘అట్లీ ఎక్కడ?’ అని అడుగుతారా ? అంటూ సెటైర్ వేశారు.
కపిల్ వ్యాఖ్యల పట్ల అట్లీ అంతే గట్టి కౌంటర్ ఇచ్చాడు. “మీ ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టమైనది. టాలెంట్ ఉన్నప్పుడు మన లుక్ ఎలా ఉందనేది ఎవరూ పట్టించుకోరు. దర్శకుడు మురుగదాస్‌గారు తొలిసారి నా స్క్రిప్ట్ చూసి నన్ను ప్రోత్సహించారు. నా రూపం చూసి అంచనా వేయలేదు. ఇది నేనెప్పుడూ మర్చిపోలేను. ప్రపంచం మన పనినే చూస్తుంది. మన రూపం ఆధారంగా అంచనా వేయకూడదు” అంటూ అట్లీ కరెక్ట్‌గా బదులిచ్చాడు. అట్లీ సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, కపిల్ తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “షోకు ఆహ్వానించిన తర్వాత అతిధిని అవమానించడం కరెక్ట్ కాదు” అంటూ కపిల్‌పై ఫైర్ అవుతున్నారు.
తనపై వస్తున్న విమర్శలను విజయాలతో తిప్పికొడుతున్న అట్లీ, తన ధైర్యం, కఠిన పరిస్థితులను ఎదుర్కొనే విధానం ద్వారా పరిశ్రమకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. జవాన్ వంటి విజయంతో తన స్థాయిని పెంచుకున్న అట్లీ, తన ప్రతిభే తన అసలైన గుర్తింపు అని మరోసారి నిరూపించాడు.