ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ ఇటీవల అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రముఖ AI సంస్థ పర్ప్లెక్సిటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో సంస్థ సీఈఓ అయిన అరవింద్ శ్రీనివాస్‌ను కలిశారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ…”సినిమా నుంచి సిలికాన్ వరకూ అభివృద్ధి ఎప్పటికీ ఆగదు. ఎంత చేసినా, ఇంకా ఏదైనా చేయాలనే ఆలోచన మనలో ఉంటూనే ఉంటుంది. పెర్ప్లెక్సిటీని చూసిన తర్వాత నాకు కొత్త ఆలోచనలు వచ్చాయి. అరవింద్ శ్రీనివాస్ మరియు ఆయన టీమ్‌ను చూసి గర్వంగా ఉంది. భవిష్యత్తు నిర్మాణంలో భారతీయ ప్రతిభ కనిపించడం ఆనందంగా ఉంది,” అని చెప్పారు.
అరవింద్ శ్రీనివాస్ మాట్లాడుతూ…”కమల్ హాసన్ గారిని మా కార్యాలయంలో ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఆయనకు సినిమాలపై ఉన్న ఆసక్తి, సాంకేతికత నేర్చుకోవాలనే తపన మాకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంది. ఆయన ‘థగ్ లైఫ్’ సినిమాతో పాటు ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం,” అని అన్నారు.
పర్ప్లెక్సిటీ అంటే ఏంటి?
పర్ప్లెక్సిటీ అనేది 2022లో ఏర్పడిన ఒక AI కంపెనీ. ఇది మనం అడిగే ప్రశ్నలకు తెలివైన సమాధానాలు ఇచ్చే ఒక జ్ఞాన కేంద్రిత వేదిక.
ఈ సంస్థకు జెఫ్ బెజోస్, యాన్ లెకున్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు మద్దతు ఇస్తున్నారు.
పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్‌లో చదివారు. తరువాత యూసీ బర్కిలీలో పీహెచ్‌డీ చేసారు. ఆయన గతంలో ఓపెన్ఏఐ, డీప్‌మైండ్, గూగుల్ వంటి పెద్ద AI కంపెనీల్లో పని చేశారు.


థగ్ లైఫ్ – కమల్ హాసన్ కొత్త సినిమా
థగ్ లైఫ్ అనేది కమల్ హాసన్ నటిస్తున్న కొత్త చిత్రం.
ఈ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం ఎ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు.
ఈ సినిమాలో కమల్ హాసన్‌తో పాటు సిలంబరసన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ లాంటి నటులు కూడా నటిస్తున్నారు.
ఈ సినిమా 2025 జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.