Movie News

కాజల్ ‘‘సత్యభామ’’ మూవీ ఎలా ఉందంటే..

‘చందమామ’ కాజల్ లీడ్​ రోల్​లో నటించిన తాజా మూవీ ‘సత్యభామ’. యాక్షన్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ మూవీ శుక్రవారం (జూన్ 7)న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు శశికిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే, సమర్పణలో సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ సత్యభామ సినిమా తెరకెక్కింది. పెళ్లి తర్వాత కాజల్ నటించిన కామ్ బ్యాక్ మూవీ ఇది. దీంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ ఫై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? కాజల్ యాక్టింగ్ ఎలా ఉంది..? కథ ఏంటి అనేది చూద్దాం.

స‌త్య‌భామ (కాజల్) షీ టీమ్‌లో ఏసీపీ స్థాయి పోలీస్​ అధికారిగా పనిచేస్తుంది. చూడటానికి శాంతంగా క‌నిపించినప్పటికీ, నేర‌స్థుల దగ్గర నుంచి నిజాలు రప్పించే విషయంలో ఆమె దిట్ట‌. త‌నకు అప్ప‌జెప్పిన కేసులన్నింటినీ సుల‌భంగా వ‌దిలిపెట్ట‌దని పేరు. అయితే ర‌చ‌యిత అమరేంద‌ర్ (న‌వీన్‌చంద్ర‌)ను ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్న సత్యభామ తన వ్య‌క్తిగ‌త జీవితానికంటే, వృత్తికే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తుంటుంది.

ఇదిలా ఉండగా, ఆమె షీ టీమ్‌లో ప‌నిచేస్తున్న‌ సమయంలోనే హ‌సీనా అనే ఓ బాధితురాలు గృహ హింస‌ని అనుభ‌విస్తూ సాయం కోసం స‌త్య‌భామ ద‌గ్గ‌రికి వ‌స్తుంది. నీకేం కాదు, అంతా నేను చూసుకుంటాన‌ని ధైర్యం చెప్పి పంపిస్తుంది సత్యభామ. అయితే ఆ తర్వాత హసీనా తన భ‌ర్త చేతిలో దారుణ హ‌త్య‌కి గుర‌వుతుంది. ఆ హ‌త్య స‌త్య‌భామ‌ను ఎంతగానో క‌ల‌చివేస్తుంది. దీంతో హ‌సీనాతో పాటు, ఎంతో మంది జీవితాల‌తో ఆడుకున్న ఆ హంతకుడిని ప‌ట్టుకునే క్ర‌మంలో స‌త్య‌భామ‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? ఆ కేసుని ఆమె వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? ఇటువంటివి తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

కాజల్ అగర్వాల్ పెళ్లి, పిల్లలు తర్వాత కంబ్యాక్ ఇవ్వడం, అందులోను మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో యాక్షన్స్ చేస్తూ రావడంతో ముందు నుంచి సత్యభామ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ లో విలన్ ని హీరో ఎలా దొరకపట్టాడు అన్నట్టు సాగుతుంది. అయితే ఇందులో కూడా అదే పాయింట్ ఉన్నా స్క్రీన్ ప్లే కొంచెం కష్టంగా రాసుకొని కథను ఎటెటో తీసుకెళ్ళిపోతారు. హసీనాను చంపిన యదుని, మిస్ అయిన ఇక్బాల్ ని వెతికే ప్రయత్నంలో ఈ కథని వుమెన్ ట్రాఫికింగ్, గేమింగ్, టెర్రరిజం, మెడికల్.. ఇలా రకరకాల పాయింట్స్ నుంచి తీసుకెళ్తారు. దీంతో కొంత కన్ఫ్యూజ్ గా, ఇదంతా అవసరమా అని అనిపిస్తుంది. అయితే స్క్రీన్ ప్లేని ఆసక్తిగా చెప్పడానికి ఈ పాయింట్స్ అన్ని తీసుకొచ్చారు అని భావించాలి.

అలాగే కథలో చాలా సార్లు వెనక్కి వెళ్తుంటారు. ట్విస్ట్ లు రివీల్ చేయడానికి కథలో వెనక్కి వెళ్తే ఆసక్తిగానే ఉంటుంది కానీ మనుషుల గురించి తెలుసుకోడానికి కూడా కథలో వెనక్కి తీసుకెళ్తే కొంచెం కష్టమే. అయితే సత్యభామ సినిమాలో ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించారు. ముఖ్యంగా కాజల్ అగర్వాల్ కి ఇచ్చిన హీరోయిక్ ఎలివేషన్స్, తను చేసిన యాక్షన్ సీన్స్ మాత్రం ప్రేక్షకులతో విజిల్స్ వేయించడం పక్కా.

ఇక ఈ మూవీ లో దాదాపు 20 ఏళ్లుగా తన నటనతో మెప్పిస్తున్న కాజల్ మొదటి సారి యాక్షన్ సీక్వెన్స్ లో కుమ్మేసింది. హీరోలకు ఏ మాత్రం తక్కువ కాదు అన్నట్టు నటించింది. అలాగే ఎమోషన్ సీన్స్ లో కూడా మెప్పిస్తుంది. ఈ సినిమా కోసం కాజల్ ఎక్కువే కష్టపడినట్టు తెరపై అర్థమైపోతుంది. నవీన్ చంద్ర కాజల్ భర్తగా కూల్ గా ఉండే వ్యక్తిగా అలరించాడు. యూట్యూబర్ నేహా పఠాన్ హసీనా పాత్రలో ఎమోషనల్ గా మెప్పిస్తుంది. ప్రజ్వల్, అంకిత్, అనిరుధ్, సంపద.. తమ పాత్రల్లో బాగానే నటించారు.