డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ అధ్యక్షుడిగా విజయం సాధించడం తో జానీ మాస్టర్ తన పదవి కోల్పోవడం ప్రస్తుతంలో ఇండస్ట్రీ లో పెద్ద చర్చగా మారింది. ఈ ఎన్నికల నిర్వహణ, దాని ఫలితాలపై జానీ మాస్టర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని వార్తా ఛానెల్స్ తనను యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారనే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు.
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఖండించిన జానీ మాస్టర్, తాను ఇంకా డ్యాన్సర్స్ యూనియన్ సభ్యుడినేనని స్పష్టం చేశారు. “నన్ను ఎవరూ తొలగించలేరు” అని చెప్పిన జానీ, ఈ ఎన్నికల నిర్వహణ పట్ల తన నిరసన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలతో తప్పుడు ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లడం బాధాకరమని అన్నారు.
ఈ ఎన్నికల నిర్వహణను అనైతికంగా, అనధికారికంగా నిర్వహించారంటూ జానీ మాస్టర్ ఆరోపణలు చేశారు. “నా పదవీ కాలం ఇంకా ఉండగానే ఎలక్షన్లు జరపడం తప్పుడు చర్య,” అని ఆయన అన్నారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, దీనిని న్యాయస్థానం వరకు తీసుకెళ్లుతానని అన్నారు. తన టాలెంట్‌ను నిరూపించుకోవడంలో ఎవ్వరూ అడ్డుపడలేరని, కేవలం అసత్య ప్రచారాలు చేయడం ద్వారా ఎవరికీ లాభం ఉండదని జానీ అన్నారు. “టాలెంట్ ఉన్నవారికి పని దొరకకుండా ఎవ్వరూ ఆపలేరు,” అని తనపై నమ్మకం ఉంచే మాటలు చెప్పారు. ప్రస్తుతం తాను ఓ సినిమా కోసం రిహార్సల్స్‌లో ఉన్నట్లు తెలిపారు.
డ్యాన్సింగ్ ఫీల్డ్‌లో తన కృషి, ప్రతిభను గుర్తు చేసిన జానీ మాస్టర్, తన మీద నమ్మకం ఉంచిన వారిని తప్పకుండా నిరాశ పరచనని తెలిపారు. ఈ వివాదం న్యాయ పరంగా ఎటువంటి పరిష్కారానికి దారితీస్తుందో చూడాల్సి ఉంది.