Movie News

సినిమా టికెట్ ధరల పెరుగుదల – ప్రేక్షకులపై ప్రభావం

ఇటీవలి కాలంలో సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెరగడం మధ్యతరగతి ప్రేక్షకులకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో మల్టీప్లెక్స్‌లలో టికెట్ల ధరలు రూ.500 దాటగా, సింగిల్ స్క్రీన్‌లలో కూడా రూ.300 పైగా ఉంటోంది. ఇది సినిమాను కుటుంబాలతో కలిసి చూసే ప్రేక్షకులకు కష్టతరంగా మారుస్తోంది.

తాజాగా పుష్ప 2 టికెట్ ధరలు ఈ అంశంపై తీవ్ర చర్చకు దారితీశాయి. మల్టీప్లెక్స్‌లలో రూ.530, సింగిల్ స్క్రీన్‌లలో రూ.350 రేట్లు నిర్ణయించడం సామాన్య ప్రేక్షకులకు షాక్‌గా మారింది. ఇది 3D సినిమా కాకుండా సాధారణ కమర్షియల్ చిత్రానికి ఆ రేట్లు అమలు చేయడం విమర్శలకు గురైంది. మునుపటి సినిమాలు దేవర మరియు కల్కి 2898ఏడీ టికెట్ ధరల విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

ఈ ధరల పెరుగుదలతో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లకు ఆదరణ పెరిగింది. కొన్ని వారాలు ఎదురు చూస్తే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే సినిమా చూడవచ్చు. ఫలితంగా, థియేటర్ అనుభవాన్ని పక్కన పెట్టి కుటుంబాలు ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇది థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమైంది. ఇటువంటి పరిస్థితులు చిన్న సినిమాలకు మరింత నష్టకరంగా మారాయి. పెద్ద సినిమాల హడావుడిలో చిన్న బడ్జెట్ చిత్రాలు కనిపించకుండా పోతుండగా, పెద్ద ధరల ప్రభావం వీటి కలెక్షన్లను కూడా దెబ్బతీస్తోంది. థియేటర్లపై ఆధారపడి జీవించే పరిశ్రమకు దీన్ని తగ్గించుకోవడం అత్యవసరం. అందరికీ అందుబాటులో ఉండే టికెట్ ధరలను నిర్ణయిస్తే, ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలతో సినిమాను వినోదంగా అందించే మార్గాన్ని పరిశ్రమ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.