News

టాలీవుడ్ లో విషాదం..ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ స్వప్న వర్మ ఆత్మహత్య

టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ స్వప్న వర్మ (33) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో తాను ఉంటున్న ఫ్లాట్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తెలుగు సినీ పరిశ్రమలో కొన్నేళ్లుగా ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తోంది. రాజమండ్రికి చెందిన స్వప్న ఇండస్ట్రీలో స్థిరపడాలని మూడేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చింది. మాదాపూర్ కావూరి హిల్స్ లోని తీగల హౌస్ అపార్ట్ మెంట్ లోని 101 ఫ్లాట్ లో ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది.

అయితే, గత ఆరు నెలలుగా తనకు ఎలాంటి ప్రాజెక్ట్ రాకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్టు సమాచారం. ఈ ఒత్తిడితోనే ఆమె రెండు రోజుల క్రితం తన ఫ్లాట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫ్లాట్ లో ఆమెతో పాటు ఎవరూ లేకపోవడంతో ఆమె ఆత్మహత్య విషయం బయటకు తెలియరాలేదు. అయితే, బాడీ డీకంపోజ్ కావడం వల్ల చెడు వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా స్వప్న విగతజీవిగా కనిపించింది. ఆమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులకు తోడు.. ఆరు నెలలుగా సినిమాలు లేకపోవడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.