-డాక్టర్ టర్నెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ డాక్టర్ సరళారెడ్డి అలియాస్ శ్రీసాయిదుర్గ
మొన్నటివరకు తన వైద్యంతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపిన ఓ డాక్టరమ్మ.. సినీ సేద్యం చేసి.. కోట్లాది మందికి మనో వైద్యం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఒక డాక్టరు భార్యగా, తను స్వయంగా ఒక డాక్టరుగా, సొంత హాస్పిటల్ నిర్వాహకురాలిగా.. తన నలుగురు పిల్లల్లో ముగ్గుర్ని డాక్టర్లను చేసిన ఆదర్శమూర్తిగా, పేరొందిన డాక్టర్ని అల్లుడిగా కలిగిన ఒక అత్తమ్మగా.. ఇంకో బిడ్డనూ ప్రయోజకుడిగా తీర్చిదిద్దిన తల్లిగా… చాలా సాఫీగా, అత్యంత సౌఖ్యవంతంగా, ఎంతో సరళంగా సాగిపోయే జీవితాన్ని పక్కన పెట్టి.. అడుగడుగునా ముళ్ళూరాళ్ళూ ఉన్న సినిమా పరిశ్రమలో.. తనకంటూ ప్రత్యేకంగా కనీసం ఓ చిన్న స్థానమైనా ఏర్పరుచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆమె పేరు ‘డాక్టర్ సరళారెడ్డి.
సాక్షాత్తూ ‘రచనా బాహుబలి’ విజయేంద్రప్రసాద్ వద్ద శిష్యరికం చేసే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకున్న ఈ డాక్టరమ్మ.. ‘డాక్టర్ భూమి’ పేరుతో ఇటీవల ఒక షార్ట్ ఫిలిం తీసి.. తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను ఘనంగా ప్రకటించుకొని ప్రముఖుల ప్రశంసలతోపాటు ‘ఉత్తమ లఘు చిత్రం’గా తృతీయ బహుమతి కైవశం చేసుకుని…. వైద్య రంగంలోనే కాదు.. వినోద రంగంలోనూ తన సత్తా చాటుకుంటానని చెప్పకనే చెప్పుకున్నారు. తన తండ్రి స్వర్గీయ వి.దామోదర్ రెడ్డి నుంచి సినిమా రంగంపై ఆసక్తి… డాక్టర్ సరళారెడ్డికి వారసత్వంగా సంక్రమించింది. స్వర్గీయ కె.వి.చలంతో తనకు గల సన్నిహిత స్నేహ బంధంతో.. హీరో కావడం కోసం అప్పటి మద్రాస్ వెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టిన దామోదర్ రెడ్డి.. తన మిత్రుడు కె.వి.చలం హఠన్మరాణాన్ని జీర్ణించుకోలేక వెనక్కి వచ్చేశారు.
తన సినిమా ప్రస్థానం గురించి డాక్టర్ సరళ మాట్లాడుతూ.. ‘సినిమా రంగంలోని వివిధ శాఖలకు చెందిన ప్రతిభావంతుల్ని కలుసుకోవడం నాకు ముందు నుంచి చాలా ఇష్టం. అక్కినేని, రామానాయుడు, దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు తదితరులను కలిసి.. నా అభిప్రాయాలు వాళ్లతో పంచుకునేదాన్ని. ఇరవై ఏళ్ళ క్రితం చిరంజీవిగారిని కలిసి.. ఓ స్టోరీ నేరేట్ చేశాను. ఆయనకు చాలా నచ్చింది కూడా. కానీ.. నేను సినిమా కోసం పూర్తిగా దృష్టి పెట్టలేని పరిస్థితి. సినిమాలపై నాకున్న ప్యాషన్… నా పిల్లల భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేయకూడదనే ఉద్దేశ్యంతో.. ‘మనసు చెమర్చేలా చేశావమ్మా’ అంటూ చిరంజీవి మెప్పు పొందినప్పటికీ.. ఆ కథని సినిమాగా రూపొందించే అవకాశం చేజేతులారా వదులుకున్నాను.
ఇప్పుడు నా నలుగురు పిల్లలు ప్రయోజకులయ్యారు. ఇద్దరబ్బాయిలు డాక్టర్లు. అమ్మాయి న్యూట్రిషనిస్ట్, అల్లుడు కూడా డాక్టరే. ఇంకో అబ్బాయి జర్మనీ లో జాబ్ చేస్తున్నాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ తో.. నేను నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన సినిమా రంగంలోకి పూర్తి స్థాయిలో ప్రవేశం చేశాను. ఓ ఏడాది క్రిత్రం రాజమౌళి పెదనాన్న డాక్టర్ రామకృష్ణగారితో.. యధాలాపంగా సినిమాలంటే నాకున్న ఇష్టాన్ని ప్రస్థావించినప్పుడు.. ఆయన నా గురించి తన సోదరుడు విజయేంద్రప్రసాద్ గారికి చెప్పారు. అయితే.. నిజానికి నేను డాక్టర్ రామకృష్ణ గారితో నా ఆసక్తిని షేర్ చేసుకునేటప్పటికీ.. అయన విజయేంద్రప్రసాద్ సొంత బ్రదర్ అని తెలియదు నాకు. ‘డెస్టినీ’ అంటే ఇదేనేమో అనిపించింది నాకు.
నేను నిజంగా రాయగలనో లేదో టెస్ట్ చేసి.. విజయేంద్రప్రసాద్ గారు వెంటనే… తన ఆస్థానంలో పనిచేసే అవకాశం కల్పించారు. ఆయన ప్రోత్సాహంతోనే ‘డాక్టర్ భూమి’ అనే షార్ట్ ఫిలింలో నటిస్తూ.. నేనే డైరెక్ట్ చేశాను. దానికి వస్తున్న ప్రశంసలు నా కాన్ఫిడెన్ లెవెల్ ని పెంచాయి’ అంటూ తన సినిమా రంగ ప్రస్థానం ఎలా మొదలయిందో వివరించారు.
ప్రస్తుతం ఆమె… జాబ్ నిమిత్తం జర్మనీలో ఉన్న తన ముద్దుల తనయుడు గౌతమ్ రాజ్ హీరోగా.. యువ ప్రతిభాశాలి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ‘ది ట్రిప్’ పేరుతో.. తన తండ్రి పేరిట నెలకొల్పిన వి.డి.ఆర్ (వి.దామోదర్ రెడ్డి) ఫిలిమ్స్ పతాకంపై ఓ విభిన్న కథాచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతే కాదు.. ఈ చిత్రానికి కథ, మాటలు తానే స్వయంగా అందిస్తుండడం విశేషం. షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపు పూర్తి చేసుకున్న ఈ ఇండిపెండెంట్ ఫిలిం.. కరోనా కలకలం తగ్గగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మరో చరిత్ర’ వంటి అజరామర ప్రేమ కథాచిత్రాన్ని తీసేనాటికి బాలచందర్ వయసు 50 పైనే అని గుర్తు చేసి తనను తాను మోటివేట్ చేసుకునే సరళ..
సమీప భవిష్యత్తులో తను దర్సకత్వం వహించే చిత్రాల్ల్లో నటీనటులకు తగిన సూచనలు ఇచ్చేందుకు ఉపయోగపడుతుందని నటలో శిక్షణ తీసుకున్నారు. అది ఆమెకు ఇప్పుడు నటిగా రాణించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. చాలా యాదృచ్చికంగా రామ్ గోపాల్ వర్మ దర్సకత్వంలో రూపొందిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంలో హోమ్ మినిష్టర్ గా నటించే అవకాశం దక్కించుకుని మెప్పించిన సరళ.. లక్ష్మణ్ కృష్ణ దర్సకత్వంలో తెరకెక్కుతున్న’సదా నీ ప్రేమలో’ నటించారు. అలాగే.. జర్నలిస్ట్ టర్నెడ్ డైరెక్టర్ నాగు గవర దర్శకత్వంలో ‘నాతి చరామి’లోనూ మంచి పాత్ర పోషించారు. ఈ రెండూ విడుదల కావలసి ఉన్నాయి. అయితే.. నటిగా ఆమె పేరు సరళ కాదు. ఓ ప్రముఖ దర్శకుడి సూచన మేరకు.. నటిగా తన పేరు ‘శ్రీ సాయి దుర్గ’. అని పెట్టుకున్నారు.
కళా తపస్వి కె.విశ్వనాధ్ కి వీరాభిమాని అయిన సరళ.. తన ఆలోచనలతో ఆయన అభిమానాన్ని చూరగొనడం విశేషం. ‘విశ్వనాధ్ గారి సినిమాలను వెర్రిగా ప్రేమించే నేను.. ఆయన్ను కలిసి కాసేపు మాట్లాడమే గొప్ప అనుకుంటే.. ఆయన్ను తరచూ కలిసే అదృష్ఠానికి నోచుకోవడం, అయన నేను రాసిన ఒక కథను వినడం, చాలా బాగుందని మెచ్చుకోవడం గర్వంగా భావిస్తున్నాను. విశ్వనాధ్ గారి ప్రశంసలకు పాత్రమైన ఈ కథను త్వరలోనే తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాను’ అన్నారు సరళ.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు నేను నా పిల్లల కోసం, కుటుంబం కోసం కష్టపడ్డాను. ఇకపై నా కుటుంబ సభ్యుల సహకారంతో నా కోసం నేను కష్టపడతాను. నా పిల్లలు, నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ గర్వపడే సినిమాలే చేస్తాను… తీస్తాను. నా అసలు కెరీర్ ఇప్పుడే మొదలైందని భావిస్తాను’ అంటారు. ప్రెజెంట్ ట్రెండ్ కి అనుగుణంగా ‘ఓటిటి’ కోసం కొన్ని వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు సరళా రెడ్డి.
స్వతహా ‘సరళ స్వభావి’ అయిన సరళారెడ్డి సంకల్పం మాత్రం ‘వజ్ర సమానని’ ఆమె కెరీర్ ని కాస్త నిశితంగా పరిశీలించినవారెవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ‘సంకల్పబలం’ వజ్ర సమానంగా కలిగినవారెవరైనా.. ఎంతటి క్లిష్ట లక్ష్యాలయినా సునాయాసంగా ఛేదించగలరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముంది?