తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో తెలుగు సినిమా అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలను చర్చించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా, ప్రభుత్వ మద్దతుతో పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడం పై దృష్టి పెట్టామన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న దృక్పథాన్ని దిల్ రాజు ప్రశంసించారు. హాలీవుడ్ స్థాయిలో హైదరాబాద్ లొకేషన్లను అభివృద్ధి చేయడం, విదేశీ చిత్ర బృందాలను ఇక్కడికి ఆకర్షించడానికి అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చర్చించామన్నారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం, ఫిల్మ్ ఫెడరేషన్ కలిసి పనిచేయడం అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని దిల్ రాజు చెప్పారు. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, 15 రోజుల్లో నివేదిక సమర్పిస్తామని వివరించారు. ఈ కమిటీలో సినీ పరిశ్రమ ప్రముఖులు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారని తెలిపారు. డ్రగ్స్ వంటి సమస్యలపై ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు తమ పరిశ్రమ సిద్ధంగా ఉందని దిల్ రాజు స్పష్టం చేశారు. ఇలాంటి అంశాలు పరిశ్రమ ప్రతిష్ఠను దెబ్బతీయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఈ దిశగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేందుకు తన చైర్మన్ బాధ్యతల్లో దృష్టి పెట్టానని దిల్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు వంటి చిన్న విషయాల కంటే, పరిశ్రమ వృద్ధి ముఖ్యమని ఆయన అన్నారు. త్వరలోనే మరోసారి సీఎంని కలిసి అభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తామని తెలిపారు. ఈ లక్ష్యంతో పరిశ్రమ మొత్తం ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.