మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
‘దేవర’ జపాన్ వెర్షన్‌ను 2025 మార్చి 28న విడుదల చేయనున్నారు. జపాన్ పోస్టర్‌లో “తిమింగలంతో పోరాడిన భారతీయ హీరో” అని హైలైట్ చేశారు. జనవరి 3న టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ‘ఆర్ఆర్ఆర్’ ఫేమ్ ఎన్టీఆర్ క్రేజ్ నేపథ్యంలో జపాన్‌లో ‘దేవర’కు భారీ స్పందన రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’తో జపాన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్‌బేస్ భారీగా పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన జపనీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ కూడా అక్కడ భారీ వసూళ్లను సాధించబోతుందని తారక్ అభిమానులు సోషల్ మీడియాలో విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
‘దేవర’లో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తంగం పాత్రలో ఆకట్టుకోగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయక పాత్రలో మెప్పించారు. ఇతర కీలక పాత్రల్లో శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ జపాన్ వెళ్లడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ‘దేవర’ ప్రమోషన్ల కోసం ఆయన అక్కడికి వెళ్తారా లేదా అనే ప్రశ్న తారక్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జపాన్ మార్కెట్లో ‘దేవర’ మరింత శక్తివంతంగా నిలవడం కోసం ఈ ప్రమోషన్లు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.