News

ప్రాణాపాయంలో మెగాభిమాని.. అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి

ఎవరికి ఆపద వచ్చినా అది తనకు తెలిసిన వెంటనే వారిని ఆదుకునే మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి ఆపద వస్తే ఊరుకుంటారా? వెంటనే రంగంలోకి దిగడమే కాక ఆయనను హైదరాబాద్ పిలిపించి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్ తన హీరో బాటలోనే సమాజ సేవలో మునిగిపోయారు.

దొండపాటి చక్రధర్ పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు, ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరపున ఆదుకున్న దొండపాటి చక్రధర్ కి క్యాన్సర్ సోకింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారన్న విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఇటీవల ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి సోమవారం సాయంత్రం వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు.