జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. భారీ మెజారిటీ తో అయన విజయం సాధించడమే కాదు..జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. తన కళ్ల ముందు తమ్ముడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ అన్నగా చిరంజీవి ఎంతో సంతోషించారు.
కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ పవన్ పలకగానే ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. సోషల్ మీడియాలో పవన్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ క్షణాన్ని ఎంతో ఆనందించనున్నారు. గొప్పగా జరుపుకోనున్నారు. పవన్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.
‘‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను’’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధాన మంత్రి మోదీ వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత తన అన్నయ్య మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి వద్దకు వెళ్ళి ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మధుర క్షణాల్లో చిరంజీవి పాదాభివందనం చేశారు. దీంతో వేదికపై కాస్త భావోద్వేగభరిత వాతావరణం కనిపించింది. వేదిక ముందు కూర్చున్న అభిమానులందరూ పవన్ గౌరవానికి ఫిదా అయిపోయారు. పవన్ కల్యాణ్ అనే నేను అంటూ పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా… ఆయన భార్య అన్నా లెజనోవా ముఖం సంతోషంతో వెలిగిపోయింది. భర్త ప్రమాణం చేస్తుండడాన్ని ఆమె ఆనందంగా తిలకించారు. అలాగే బాబాయ్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా రామ్ చరణ్ ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంత తరలివచ్చారు.