Movie News

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కు పెద్ద రిలీఫ్ దొరికింది

దాదాపు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న వరకట్నం కేసులో ప్రముఖ నటుడు, జనసేన నేత పృధ్వీ రాజ్‌కు పెద్ద రిలీఫ్ లభించింది. విజయవాడ కోర్టు అతనికి అనుకూలంగా సానుకూల తీర్పు ఇవ్వడం తో హమ్మయ్య అనుకున్నారు. 2016లో పృధ్వి భార్య శ్రీలక్ష్మి విజయవాడ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు పృధ్వీపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. పెళ్లి సమయంలో డబ్బు, బంగారు ఆభరణాలు కట్నంగా తీసుకున్నప్పటికీ అదనపు కట్నం కోసం పృధ్వి తనను వేధించేవాడని శ్రీలక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొంది. సినిమాల్లో తన కెరీర్‌ను కొనసాగించేందుకు హైదరాబాద్‌కు వెళ్లిన తర్వాత అతను తనను నిర్లక్ష్యం చేశాడని ఆమె పేర్కొంది.

కేసును విచారించిన పోలీసులు 2017లో విజయవాడలోని రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వద్ద చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఇరువర్గాల వాదనలతో కోర్టులో కేసు నడుస్తోంది. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన జస్టిస్ మాధవీ దేవి నిన్న తన తీర్పును వెలువరించారు. పృధ్వీకి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేనందున, కేసు కొట్టివేస్తున్నట్టున్నగా న్యాయమూర్తి తెలిపారు. దీంతో ఈ కేసు నుంచి ఆయన బయటపడ్డాడు.