Monday, December 23, 2024
HomeMovie NewsReview : భారతీయుడు 2 - మెప్పించలేకపోయాడు

Review : భారతీయుడు 2 – మెప్పించలేకపోయాడు

- Advertisement -

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భార‌తీయుడు 2 మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌ల్ట్ క్లాసిక్‌గా నిలిచిన‌ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను ఏ మేరకు ఆకట్టుకున్నాడనేది చూద్దాం.

స్టోరీ :

అరవింద్ (సిద్దార్థ్) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియా వేదిక అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నిస్తాడు. బార్కింగ్ డాగ్స్ అనే యూట్యూబ్ చానెల్ నడుపుతూ అందులో అవినీతి పరుల మీద ఫన్నీ సెటైరికల్ ఎపిసోడ్స్ నడిపిస్తుంటాడు. అరవింద్ తండ్రి వరదరాజన్ (సముద్రఖని) అవినీతి నిరోధక శాఖలో పని చేస్తుంటాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదురించాలని అరవింద్ ఆరాటపడుతుంటాడు. కానీ తిరిగి అరవింద్‌కే సమస్యలు వస్తాయి. అరవింద్ అండ్ గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చివరకు ఈ అవినీతిని అరికట్టాలంటే ఇండియన్ (కమల్ హాసన్) రావాల్సిందే అని ఈ నలుగురూ కలిసి కమ్ బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తారు. చివరకు సేనాపతి (కమల్ హాసన్) రంగంలోకి దిగుతాడు. సేనాపతి యువతకు ఇచ్చిన సందేశం ఏంటి? ఆ సందేశాన్ని పాటించిన యువతకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కమ్ బ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ నుంచి గో బ్యాక్ ఇండియన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ క్రమంలో సేనాపతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా) పాత్ర ఏంటి? ఈ కథ కు ఎస్ జె సూర్య కు సంబంధం ఏంటి అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

విశ్లేషణ :

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీయ‌డంలో డైరెక్టర్ శంక‌ర్‌కు ప్ర‌త్యేక‌మైన శైలి ఉంది. తొలి సినిమా జెంటిల్‌మెన్ నుంచి 2.ఓ వ‌ర‌కు ప్ర‌తి సినిమాలో ఏదో ఒక సామాజిక స‌మ‌స్య‌ను ట‌చ్ చేస్తూ వ‌చ్చారు శంక‌ర్‌. ఈ సోష‌ల్ ఇష్యూకు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను, టెక్నాల‌జీని జోడించి ప్రేక్షకులకు కొత్తదనం అందిస్తుంటాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 కథ కూడా అలాంటిదే.

భార‌తీయుడు సినిమాలోని సేనాప‌తి క్యారెక్ట‌ర్‌ను ప్ర‌ధానంగా తీసుకొని నేటి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లుగా ఈ సీక్వెల్‌ను చేయాల‌ని శంక‌ర్ అనుకున్నారు. ఇండియ‌న్ క‌ల్ట్ క్లాసిక్‌గా నిల‌వ‌డం, అందులో సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ న‌ట విశ్వ‌రూపం కార‌ణంగా ఇండియ‌న్ 2 కోసం తెలుగు, త‌మిళ ఆడియెన్స్ చాలా ఏళ్లుగా ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఆ ఎదురుచూపుల‌కు త‌గ్గ ఫ‌లితం మాత్రం ద‌క్క‌లేదు. ఇండియ‌న్ మ్యాజిక్‌ను సీక్వెల్ తో అందించ‌లేక‌పోయాడు శంక‌ర్‌.

భారతీయుడు సినిమాను చూస్తే గుండె బరువెక్కుతుంది.. కళ్లు చెమర్చుతాయి. కానీ ఈ రెండో పార్ట్ చూస్తే నీరసం, అలసట వస్తాయి. కొన్ని చోట్ల క్రింజ్‌లా అనిపిస్తుంది. ఏ మాత్రం ఎమోషనల్‌గా తీయలేకపోయాడు శంకర్. ఎవరి పాత్రని కూడా గుండెకు హత్తుకునేలా మల్చలేకపోయాడు దర్శకుడు. ప్రారంభం కూడా ఏమంత ఆసక్తిగా అనిపించదు. సేనాపతి ఎంట్రీ ఇచ్చాక అయినా గాడిన పడుతుందా? అంటే అదీ లేదు. ఇక సేనాపతి స్క్రీన్ పైకి వచ్చాడంటే.. ఎవరో ఒకరికి మూడిందనే అర్థం. చంపడానికే అన్నట్టుగా సేనాపతి పాత్ర కనిపిస్తుంది. ఏ మాత్రం ఎమోషనల్‌గా సేనాపతి పాత్రకు ఆడియెన్స్‌కు మధ్య వారధిని శంకర్ క్రియేట్ చేయలేకపోయాడు.

అపరిచితుడులో ఒక్కొక్కరినీ ఒక్కో విధంగా చంపినట్టుగా.. ఇందులో వర్మం (మర్మ కళ)తో రకరకాలుగా చంపేస్తుంటాడంతే. కమ్ బ్యాక్ ఇండియన్ అన్న జనాలే గో బ్యాక్ ఇండియన్ అంటారు.. ఆ ఎమోషన్, ఆ లాజిక్ మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కదు. ప్రీ క్లైమాక్స్‌లో ఇండియన్‌ను జనాలు రాళ్లతో, కర్రలతో కొడతారు. కనీసం ఆ సీన్ అయినా జనాలకు ఎమోషనల్‌గా అనిపించదు. స్క్రీన్ ప్లే పరంగా గానీ, కథ పరంగా గానీ ఎక్కడా కూడా వావ్ అనిపించదు.

ఇక సినిమాలో బాగున్నాయి అనిపించేవి ..

భారీ తారాగణంతో పాటు అద్భుతమైన విజువల్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు పర్వాలేదు అనిపించాయి. సేనాప‌తిగా క‌మ‌ల్‌ హాస‌న్ ఎప్పటిలాగే త‌న యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. కమ‌ల్‌ లుక్‌ అండ్ మ్యాన‌రిజ‌మ్స్‌తో పాటు ఆయ‌న‌పై వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే బ్రేకింగ్ డాగ్స్ అంటూ సాగిన యానిమేషన్ విజువల్స్ కూడా బాగున్నాయి.

చిత్ర అరవిందన్‌ పాత్రలో సిద్ధార్థ్ ఒదిగిపోయాడు. పైగా సిద్దార్థ్ కి స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువగానే ఉంది. సకలకళ వల్లవన్ సర్గుణ పాండియన్‌గా SJ సూర్య తన పాత్రకు ప్రాణం పోశారు. సిబిఐ ప్రమోద్‌గా బాబీ సింహా ఆకట్టుకున్నాడు. దిశా పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా మెప్పించింది. నటి ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో మెరిశారు. మరో కీలక పాత్రలో సముద్రఖని కూడా చాలా బాగా నటించాడు.

ఇక దేశంలోని అవినీతి రాజకీయ నాయకులను, అలాగే అధికారుల అక్రమాలను బహిర్గతం చేస్తూ సాగే కార్టూన్ ట్రాక్ సినిమాలో హైలైట్ గా ఉంది.

ఫైనల్ గా..

1996లో సోషల్ కల్ట్ క్లాసిక్‌గా భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయిన సినిమా ‘భారతీయుడు.’ 40 ఏళ్ళ కమల్ హాసన్‌ను 70 ఏళ్ళ సేనాపతిగా చూసిన తెలుగు ప్రేక్షకులు, ఆ పాత్రను అలానే ఇప్పటి వరకు గుర్తుంచుకున్నారంటే దానికి కారణం కమల్ నటన, శంకర్ దర్శకత్వాలే. కానీ అవేవి కూడా భారతీయుడు 2 లో కనిపించలేదు. ప్రతిఫలంగా సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ప్రభావం చరణ్ తో చేస్తున్న గేమ్ ఛేంజర్ ఫై భారీగా పడనుంది.

- Advertisement -

You can get Latest stories from Universal Talkies on Telegram everyday.
Click to follow Universal Talkies facebook page and twitter .

Follow Universal Talkies Google News

spot_img

TOP Stories

Most Read