తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషించిన ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య (Balagam Mogilaiah) కన్నుమూశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మొగిలయ్య బలగం సినిమాతో ఎంతో గుర్తింపు పొందారు. ఆ సినిమాలో ఆయన పాడిన పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ పాట, కుటుంబ విలువలు, మానవీయ భావోద్వేగాలను ఆసక్తిగా ప్రదర్శించింది. ఈ పాట విడుదలైన తరువాత మొగిలయ్యను తెలంగాణలో ఒక జానపద సాంస్కృతిక ప్రతినిధిగా కొనియాడారు.
కొన్ని రోజులుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న మొగిలయ్య, చికిత్స కోసం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు వంటి ప్రముఖులు ఆర్థికసాయం అందించారు. అయితే ఆయన పరిస్థితి ఇంకా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను మరింత చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మొగిలయ్య మృతి పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. “నీ పాటకు చెమర్చని కళ్ళు లేవు, చలించని హృదయం లేదు. తెలంగాణ ప్రేమైక జీవనాన్ని ఆవిష్కరించి, మాయమైపోతున్న కుటుంబ సంబంధాలను గుర్తుచేసినందుకు ఆయన్ను గుర్తుంచుకుంటాం” అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మొగిలయ్య మరణించినా ఆయన పాటలు తెలంగాణ సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.