Movie News

ధనుష్‌కు అండగా ఆర్టిస్ట్స్ అసోసియేషన్

ధనుష్‌కు సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అండగా నిలబడింది. తమిళ నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని లేఖ రాసింది. కోలీవుడ్ లో నెలకొన్న సమస్యలపై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి(TFPC) తాజాగా ఓ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఇండస్ట్రీ అభ్యున్నతి కోసం పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అందులో భాగంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని, ఆగస్ట్‌ 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, అలాగే నవంబర్‌ 1 నుంచి సినిమా సంబంధిత కార్యకలాపాలను కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.

ఇదే క్రమంలో హీరో ధనుష్ పై తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరి నిర్మాతల దగ్గర భారీగా అడ్వాన్స్ తీసుకుని షూటింగ్స్ రావడం లేదన్నది ధనుష్ పై ఉన్న అభియోగం. దాంతో ధనుష్ తో కొత్త సినిమాలు ప్రారంభించే ముందు.. అతడికి అడ్వాన్స్ ఇచ్చిన పాత సినిమా నిర్మాతలను ఓసారి సంప్రదించాలని పేర్కొంది. అదీకాక ఈ విషయాన్ని మండలికి కూడా తెలియజేయాలని సూచించింది. హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్లు, అడ్వాన్సుల వివాదం నేపథ్యంలో ఆగస్టు 16వ తేదీ వరకు కొత్త సినిమాల షూటింగులను వాయిదా వేసింది. దాంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఆగస్టు 15వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగులు స్టార్ట్ చేయవద్దు. పాత సినిమాల షూటింగులు అక్టోబర్ 31వ తేదీ వరకు పూర్తి చేయాలి అని నిర్మాతల మండలి అల్టిమేటం ఇచ్చింది. కొత్త సినిమాల చిత్రీకరణ ప్రారంభించకూడదని, షూటింగ్ బంద్ చేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ‘ది సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ తెలియజేసింది. ఆ నిర్ణయం వెలువరించే ముందు కనీసం తమను సంప్రదించలేదని ఓ లేఖలో వివరించింది. నిర్మాతల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

అలాగే తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (Tamil Film Producers Council) నుంచి ధనుష్ మీద ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవని ‘ది సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ వివరించింది. అంతే కాదు, అతడి మీద కొత్తగా కంప్లైంట్స్ ఏవీ నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఇరు వర్గాలు కూర్చుని చర్చించుకుంటే సమస్యకు పరిష్కార మార్గం వెతకడం సులభం అవుతుందని సూచించింది.