Movie News

అల్లు అర్డున్​పై మెగాస్టార్ ప్రశంసలు

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో 16వ సీజన్‌లో భాగంగా ఓ ఎపిసోడ్‌లో, కోల్‌కతాకు చెందిన గృహిణి కంటెస్టెంట్ బన్నీ తన అభిమాన నటుడని తెలిపింది.

దీనిపై అమితాబ్ స్పందిస్తూ..”అల్లు అర్జున్ తనకు వచ్చిన గుర్తింపుకు పూర్తిగా అర్హుడు. అతడు ఎంతో ప్రతిభావంతుడైన నటుడు. ‘పుష్ప: ది రూల్’ సినిమా మంచి విజయం సాధించింది. తను నాకూ అభిమాన పాత్రధారి. అయితే మా ఇద్దరిని పోల్చవద్దు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ అమితాబ్‌తో మాట్లాడుతూ, మీ ఇద్దరి మేనరిజం కొన్ని సన్నివేశాల్లో ఒకేలా ఉంటుందని తెలిపింది. “మీరు నన్ను కలవడం నా కల. ఒకరోజు అల్లు అర్జున్‌ను కలిస్తే నా జీవితసాఫల్యం నెరవేరుతుంది” అంటూ ఆ గృహిణి తన అభిమానం వ్యక్తం చేసింది. ఈ మాటలపై బిగ్ బీ సంతోషంగా స్పందించారు.

ఇదిలా ఉండగా, ఇటీవల ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ ముంబైలో ఇచ్చిన ఇంటర్వ్యూలో అమితాబ్‌ తనకు స్ఫూర్తి అని వెల్లడించారు. “అమితాబ్‌ బచ్చన్ సినిమాలు చూస్తూ నేను పెరిగాను. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎన్ని సంవత్సరాలుగా ఆయన స్టార్‌గా కొనసాగుతున్నారు. ఆయన పని తీరే నన్ను ప్రేరణతో ముందుకు నడిపిస్తోంది” అంటూ బన్నీ చెప్పిన మాటలు ప్రశంసలందుకున్నాయి. అలాగే, అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా అల్లు అర్జున్‌ను ప్రశంసిస్తూ వీడియో షేర్ చేశారు. “అల్లు అర్జున్ పని తీరుకు నేను వీరాభిమానిని. అతడు మరిన్ని విజయాలు సాధించాలి” అని పేర్కొన్నారు. దీనికి బన్నీ రిప్లై ఇచ్చారు. “మీరు మా సూపర్ హీరో. మీ అభిప్రాయాలను వినడం నమ్మలేకపోతున్నా. మీ ప్రేమకు ధన్యవాదాలు” అని బన్నీ ఆనందం వ్యక్తం చేశారు.