Movie News

నేను కావాలని చేసింది కాదు – అల్లు అర్జున్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా జరిగిన థియేటర్ తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరుల ఆరోపణల నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన భావాలను వెల్లడించారు. “ఆ ఘటన అత్యంత దురదృష్టకరం. మహిళ రేవతి మృతి చెందడం నాకు తీవ్ర మనస్తాపం కలిగించింది. ఆమె కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని అల్లు అర్జున్ తెలిపారు.

ఈ సంఘటనలో ఎవరూ బాధ్యులు కాదని, పరిస్థితుల దారితే ఆ ప్రమాదం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. “మేము థియేటర్ లోకి వెళ్లింది పోలీసుల సూచన మేరకే. జనాలను నియంత్రించేందుకు కారు నుండి బయటికి వచ్చి అభివాదం చేశాను. నేను ఎక్కడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించలేదు. కొన్ని తప్పుడు ఆరోపణలు వినిపించటం చాలా బాధగా ఉంది” అని అన్నారు.

ఘటన జరిగాక బాధిత కుటుంబాన్ని కలవాలన్న తన ప్రయత్నాలను, న్యాయపరమైన సూచనల కారణంగా నిలిపివేయాల్సి వచ్చిందని అల్లు అర్జున్ తెలిపారు. “బన్నీ వాసు మరియు మా న్యాయబృందం సూచనల ప్రకారం, ఆ సమయంలో బాధితుల వద్దకు వెళ్లకుండా మా పరిధిలో వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, చిన్నారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం” అని ఆయన వివరించారు.

అదేవిధంగా, తనపై వచ్చిన ఆరోపణలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, 20 ఏళ్లుగా ప్రేక్షకుల ప్రేమకు అర్హుడిగా ఉండటానికి శ్రమిస్తున్న తనకు ఇలాంటి ఆరోపణలు నమ్మలేనివిగా కనిపిస్తున్నాయని అన్నారు. “థియేటర్ ను ఆలయంగా భావించే వ్యక్తిగా, ప్రేక్షకుల సంతోషమే నా లక్ష్యం. అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఈ సంఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది” అని అల్లు అర్జున్ తెలిపారు.

తర్వాతి రోజుల్లో బాధిత కుటుంబానికి మరింత సహాయం అందించడంపై తన బృందం, చిత్ర నిర్మాతలు, దర్శకుడితో చర్చిస్తున్నామని వెల్లడించారు. “ఘటన జరిగి కొన్ని రోజులు గడుస్తున్నా నేను ఇంకా ఆ ఘటన ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నాను. ఒక నటుడిగా, తండ్రిగా బాధిత కుటుంబానికి నా మద్దతు ఇస్తూనే ఉంటాను” అని అన్నారు.