Movie News

అఖండ-2 స్క్రిప్ట్ పూర్తి.. విలన్ కోసం వేట..?

చిత్రసీమలో కొన్ని కాంబినేషన్లు అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. రికార్డులు, కలెక్షన్లు, అవార్డుల గురించే చర్చ నడుస్తుంటుంది. అలాంటి క్రేజీ కాంబోల్లో బాల‌కృష్ణ (Balakrishna), బోయ‌పాటి శీను (Boyapati srinu) ఒకటి. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సింహా, లెజెండ్‌, అఖండ.. ఒకదానికి మించి మరొకటి భారీ విజయాలు అందుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించాయి. ముఖ్యంగా బోయపాటి కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది అఖండ. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా అఘోరా పాత్ర సినిమాకే హైలెట్ అయింది. ఈ సినిమాకి థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. అలాంటి ఈ మూవీ కి ప్రస్తుతం సీక్వెల్ గా తెరకెక్కించే పనిలో ఉన్నారు బోయపాటి. గతేడాది రామ్ పోతినేనితో ఆయన తీసిన ‘స్కంద’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో అఖండ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు మొదలైనట్లు సమాచారం. డైరెక్టర్ ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో కీలకమైన విలన్ పాత్ర కోసం సంజయ్ దత్, బాబీ డియోల్ లాంటి స్టార్లను సంప్రదించినట్లు టాలీవుడ్ టాక్. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి.