మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుంచి తనని సస్పెండ్ చేయడంపై నటి హేమ మా అధ్యక్షుడు మంచు విష్ణు కుబహిరంగ లేఖ రాశారు. నిజానిజాలు తెలీకుండా తనని మా నుంచి తొలిగించడం అన్యాయమని తనకి సభ్యత్వాన్ని తిరిగి కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు హేమను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ లో హేమ డ్రగ్స్ తీసుకుందని రక్త నమూనా లో తేలడం తో ఆమెను అదుపులోకి తీసుకొని జైలు కు తరలించారు. ఆ తర్వాత ఆమె బెయిల్ ఫై బయటకు వచ్చింది. ఈ క్రమంలో మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేసినట్లుగా అధ్యక్షుడు విష్ణు ప్రకటించారు. ఈ అంశంపైనే హేమ తాజాగా లేఖ రాశారు.
నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఈ అంశంలో మీడియా నాపై అనేక నిరాధారమైన ఆరోపణలు చేసింది. అందుకే దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్‌లో నేను పరీక్షలు చేయించుకున్నాను. వాటిలో నేను డ్రగ్స్ తీసుకోలేదని రిపోర్ట్ వచ్చింది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లో కూడా ఇవే ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాను. అయితే రిపోర్ట్స్ రాకముందే నేను తప్పు చేసినట్లుగా, నన్ను దోషిగా భావించి ‘మా’ సభ్యత్వం రద్దు చేయడం కరెక్ట్ కాదు. ఇక కొన్ని రోజులుగా నాపై చాలా దుష్ప్రచారం జరుగుతుంది. దీని వల్ల నేను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు ‘మా’ అండగా నిలవాలి. నేను ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. నాకు ఎంతోమంది అభిమానులను కూడా ఉన్నారు. ఇలాంటి ప్రచారం వల్ల నాకు లేనిపోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి కూడా నన్ను రక్షించాల్సిన బాధ్యత ‘మా’పై ఉంది. కనుక ఇవన్నీ ఆలోచించి నాపై వేసిన సస్పెన్షన్‌ను ఎత్తేస్తారని నేను భావిస్తున్నాను.” అంటూ హేమ లేఖలో పేర్కొంది. మరి దీనిపై మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.