రాజకీయ వార్తలు

గుక్కతిప్పుకోనివ్వని ప్రశ్నలతో పవన్ కు చురకలు

ముద్రగడ పద్మనాభం.. రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని ప్రజానాయకుడు.. అవును .. అప్పుడెప్పుడో నలభయ్యేళ్ళ క్రిందట మంత్రిగా చేసి, ఆ తరువాత ఈనాటి వరకూ ఏ రాజకీయ పదవీ చేపట్టకుండా కేవలం కాపుల ప్రయోజనాలు కాపాడే ఉద్యమాల్లోనే జీవిస్తూ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న ఆయన పవన్ కళ్యాణ్ కు గట్టి క్లాస్ పీకారు.. తానూ ఏనాడూ ఉద్యమాన్ని అమ్ముకోలేదు అంటూ కాపు ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు తాకట్టు పెట్టేందుకు సిద్ధమైన పవన్ కు గట్టి మొట్టికాయ వేశారు. ముందు మాట మార్చుకోండి.. తీరు మారాలండి .. వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటి ? అంటూనే మీరు ఇంతవరకూ ఎంతమందికి చెప్పుతో కొట్టారు, ఎన్ని తొక్కలు తీశారు? ఎన్ని గుండ్లు గీశారు అంటూ ర్యాగింగ్ చేసారు.

తాను ఏనాడూ ఓటమి ఎరుగను అంటూ నువ్వు రెండు చోట్లా ఓడిపోయావుగా అని చెప్పకుండానే వెక్కిరించారు. తానూ ఇన్నేళ్ళుగా కాపుల ప్రయోజనాలు.. వారి రిజర్వేషన్ల కోసం మాత్రమే పని చేశాను తప్ప వేరేవారి పల్లకీకి భుజం కాయలేదు అని అన్నారు. తాను ఇన్నేళ్ళలో ఎన్నడూ సూట్ కేసులకు అమ్ముడుపోలేదు అని ఘంటాపథంగా చెప్పారు. తాను ఏనాడూ కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోలేదని, తానూ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కుల అస్తిత్వం కాపాడడానికి .. వారి ప్రయోజనాలకోసమే పోరాడుతూ ఉన్నానని. కాపు నాయకులకు సీఎం పదవి ఇవ్వాలని సైతం పట్టుబడిన వ్యక్తిని అని అన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ అమ్మకం వంటి సమస్యల మీద పోరాడాలని సూచిస్తూ మీరు కులాన్ని అడ్డంపెట్టుకుని బతకడానికి తప్ప ప్రజాపోరాటాలకు పనికిరారు అనే విషయాన్ని దెప్పి పొడిచారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో అవమానకరంగా మాట్లాడిన పవన్ను ఈ లేఖలో పద్మనాభం ఉతికేసారు. దశాబ్దాలుగా ద్వారంపూడి కుటుంబం ప్రజాజీవనంలో ఉందని గుర్తు చేస్తూనే కాపు ఉద్యమానికి నిత్యం వారితోబాటు వారి తండ్రి , తాతయ్య సైతం వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. తాను ఎప్పుడు ఉద్యమం చేసినా అన్నివిధాలా వారి కుటుంబం సహకరిస్తూనే ఉండేది అని చెబుతూ ద్వారంపూడి కి తన మద్దతు తెలిపారు.


ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికీ మాట్లాడడం రాదని, డబ్బుకు కులాన్ని అమ్ముకునే వ్యక్తి అని వెక్కిరిస్తూ మర్యాదగా వాయించి పారేసారు ముద్రగడ పద్మనాభం.